Saturday, April 27, 2024

అగ్రకులాల ప్రాపకం కోసం ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ల నిధులు మళ్లిస్తారా?

అగ్రకులాల ప్రాపకం కోసం ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ల నిధులు మళ్లిస్తారా? అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు కలిగిన ఎస్సీ, ఎస్టీలను తీవ్ర విస్మయానికి గురిచేసింది అని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్  కోసం ఈసారి బడ్జెట్ లో 18,518 కోట్లు, ఎస్టీలకు 6,125 కోట్లరూపాయలు కేటాయింపులు చూపారని తెలిపారు. గత ఏడాది బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద 13,835 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 5,315 కోట్లు కేటాయింపులను చూపించారని గుర్తు చేశారు. ఈ నిధుల వ్యయానికి సంబంధించి బడ్జెట్ లో చూపిన లెక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలను ఎంతదారుణంగా వంచిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. గత ఏడాది నవరత్నాల కింద ఎస్సీలకు ఇచ్చిన 5,738 కోట్లు, ఎస్టీలకు ఇచ్చిన రూ. 1475 కోట్లు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కింద ఖర్చుచేసినట్లు చూపడం రాష్ట్రంలో కోటిన్నరమంది ఎస్సీ, ఎస్టీలను దారుణంగా వంచించడమే అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించే నిధులను కేవలం ప్రత్యేకించి ఎస్సీ,ఎస్టీ పథకాలకు మాత్రమే ఖర్చుచేయాల్సి ఉండగా, రాష్ట్రంలో ఉన్నతస్థాయి సామాజికవర్గాలకు ఇచ్చిన పథకాలనే ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి సబ్ ప్లాన్ గా చూపడం ఎస్సీ, ఎస్టీలను మోసగించడమే అని పేర్కొన్నారు. 2019-20లో రూ. 15,000 కోట్లు కేటాయించి రూ. 4,378 కోట్లు ఖర్చు చేశారు. 2020-21 బడ్జెట్ లో రూ.15,735 కోట్లు కేటాయించి అందులో రూ.7,525 కోట్లు ఇతర కార్యక్రమాల కోసం మళ్లించారని ఆరోపించారు. అంటే కేవలం రూ. 8210 మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

రాష్ట్రంలో పట్టుమని నాలుగుశాతం కూడా లేని రెడ్డి కార్పొరేషన్ కు బడ్జెట్ లో రూ.3033 కోట్లు, కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ కు 1900 కోట్లు వెరసి దాదాపు రూ.5 వేల కోట్ల రూపాయలు కేటాయించడం వైసిపి ప్రభుత్వ బరి తెగింపునకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. అధికారం చేతిలో ఉంది కదా అని సమాజంలో బలమైన సామాజికవర్గాల ఓటు బ్యాంకు కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వేలకోట్ల రూపాయలు నిధులు మళ్లించారని మండిపడ్డారు. వాస్తవానికి ఎస్సీ,ఎస్టీ, బిసిల కోసం వెచ్చించాల్సిన నిధులనే అగ్రవర్ణాల కార్పొరేషన్లకు ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. నవరత్నాల కింద అగ్రవర్ణాలకు ఇస్తున్న నిధులన్నీ ఎస్సీ,ఎస్టీ, బిసి వర్గాలకు చెందాల్సినవే అని తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాథికి అమలుచేసిన ఎన్ఎస్ కెఎఫ్ డిసి, ఎన్ఎస్ ఎఫ్ టిడిసి, అంబేద్కర్ ఓవర్సీస్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సహకాలు వంటివి రద్దుచేసి తీరని ద్రోహం చేశారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యావత్ ఎస్సీ, ఎస్టీ కులాలు సంఘటితమై బుద్దిచెప్పేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement