Wednesday, May 22, 2024

వైకాపా ప్లీనరీ కసరత్తు షురూ ! వివిధ కమిటీల ఏర్పాటు..

అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే నెల 8,9 తేదీల్లో జరగనున్న వైకాపా ప్లీనరీకి అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సన్నాహిక సమావేశాల పేరుతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ వచ్చే నెల 1వ తేదీన జిల్లా స్థాయిలో ప్లీనరీ నిర్వహించబోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు చేయాల్సిన తీర్మానాలపై సీనియర్‌ నేతలతో కూడిన కమిటీ కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో పార్టీ బైలాలో చేయాల్సిన సవరణలు, పొందుపర్చాల్సిన అంశాలపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. కొత్త కమిటీల ఏర్పాటుపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా వివిధ అంశాలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేశారు. వేదిక ఏర్పాట్లు, ఆర్ధిక అంశాలు, తీర్మానాలు, సభ నిర్వహణ కమిటీ, సమన్వయ కమిటీ వంటి వాటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీల నిర్వహణలో ఆయా పనుల నిర్వహణ కసరత్తును ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్లీనరీ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో అధినేత ప్రసంగంపై కూడా ప్రత్యేకతను సంతరించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ధృఢనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా పార్టీ నిర్మాణంలో కొన్ని కీలక మార్పులు చేపట్టాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ) స్థానంలో కోర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీకి చెందిన విధాన పరమైన నిర్ణయాల్లో ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఈ కమిటీలో గరిష్టంగా 15 మంది వరకూ సభ్యులు ఉండేలా నిర్ణయించారు. దీనికి సమాంతరంగా సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ పేరుతో పార్టీలో అత్యంత సీనియర్లుగా ఉన్న వారితో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు కమిటీలు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అధినేతకు తుది నివేదికను అందజేస్తారు. ఈ నివేదికలపై అధినేత వీరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు ప్లీనరీలో ప్రవేశపెట్టబోయే తీర్మానాలపైన కూడా కసరత్తు జరుగుతోంది. ఈసారి ప్లీనరీలో మొత్తం 12 నుండి 15 వరకూ తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లడం, ఆర్బీకేల ఏర్పాటు, ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇటీవల జరిగిన దావోస్‌ పర్యటన, బీసీలకు పెద్ద పీట వేయడం, గిరిజనులు, మైనార్టీలకు ప్రభుత్వం చేస్తున్న లబ్ది, జిల్లాల విభజన, మ#హళల ఆర్ధిక, రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జగనన్న కాలనీల వంటి ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే క్రమంలో పార్టీ బైలాలో కొన్ని మార్పులు, కొన్ని సవరణలు కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement