Thursday, May 2, 2024

Followup : తెలుగుగంగపై సెన్సార్‌లు ఏర్పాటు చేయాలి.. బేసిన్‌లోని ప్రజల అవసరాలే ముఖ్యమన్న తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చెన్నై తాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించాలన్న ఏపీ వాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి పాయింట్‌ నుంచి నీటిని తోడెస్తుండడంతో ఒప్పందం ప్రకారం చెన్నై నగర తాగునీటి కోసం ఏటా 15టీఎంసీలను ఇవ్వలేకపోతున్నామని ఏపీ పేర్కొంది. చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించి కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఏపీ రాష్ట్రాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య తెలుగుగంగ పథకంపై వాడీ వేడీ చర్చ జరిగింది. తెలుగుగంగ పథకం పేరు చెప్పి ఏపీ అక్రమంగా ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోతోందని తెలంగాణ ఆరోపించింది. ఒప్పందం ప్రకారం తెలుగుగంగకు 15 టీఎంసీలనే తరలించడం నిజమయితే… తెలుగు గంగపై ఉన్న అన్ని పాయింట్ల వద్ద సెన్సార్‌లు, వాటర్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీని తెలంగాణ డిమాండ్‌ చేసింది. బనకచర్ల క్రాస్‌, వెలుగోడు, చెన్నముఖపల్లి తదితర అన్ని స్లూయిస్‌ల వద్ద సెన్సార్‌లు ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టింది.

సమావేశంలో 2022-23 నీటి సంవత్సరానికి సంబంధించి చెన్నై నగరానికి తాగునీటి సరఫరా అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. చెన్నై తాగునీటి సరఫరాకు శ్రీశైలం ప్రాజెక్టుపై మరో లిఫ్ట్‌ ను ఏర్పాటు చేయాలన్న పాత ప్రతిపాదనను ఈ సమావేశంలోనూ ఏపీ అధికారులు లేవనెత్తగా తెలంగాణ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కల్వకుర్తి వద్ద నుంచి నీటి ఎత్తిపోతలను ఆపాలన్న ఏపీ అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ పరిధిలో తాగు, సాగునీటి అవసరాలు ఉంటాయని, బేసిన్‌లోని అవసరాలను కాదని… బేసిన్‌ అవతల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించుకుపోతామన్న ఏపీ వాదనపై తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ వాదనలతో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement