Wednesday, May 8, 2024

నవరత్నాల్లో మద్యం కూడా ఒక రత్నమే..

మూడేళ్ల పరిపాలనలో నవరత్నాల్లో భాగమైన ఈ మద్యపానాన్ని ఎందకు నిషేదించలేక పోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు మడమ తిప్పరు కదా? అని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మద్యపానం నిషేదించండి, చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రవర్తన సరిగా లేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ పద్ధతి మార్చుకోకపోతే చిడతలు వాయించుకుంటూ, గోడలకు పిడతలు వేసుకోవడమే మీకు మిగులుతుందని ఎద్దేవా చేశారు.

జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బిజెపి రోడ్డు మ్యాప్ కోసం వేచి ఉన్నానని చెప్పడం దిగజారుడు రాజకీయమని అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీలోనే జనసేన పార్టీని కలిపేయాలని సూచించారు. డొంక తిరుగుడు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనకి వచ్చినా కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదన్నారు. ప్రత్యేక హోదా చేతకాదు, చేతనయితే గత ఐదేళ్ల పాలనలో కడప స్టీల్ ప్లాంట్ తెచ్చేవాడని అన్నారు. పవన్ కళ్యాణ్ వీరికన్నా సమర్థుడా.. స్టీల్ ప్లాంట్ కడపకు తెస్తాడా అని ప్రశ్నించారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నే ప్రైవేటు పరం చేయాలని బిజెపి కుతంత్రాలు చేస్తోందని మండిపడ్డారు. మీ పార్టీలను నమ్మి ప్రజలు ఎందుకు ఓటెయ్యాలి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకు రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తులసి రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement