Friday, May 3, 2024

బిజెపి కార్యాలయం ముట్టడి భగ్నం

రాయలసీమ డిక్లరేషన్ పై మౌనం వీడాలని, కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలంటూ రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కర్నూల్ బిజెపి కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేతలను మార్గంమధ్యలో అరెస్టు చేసి ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనంతరం నేతలను కర్నూల్  3టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సీమను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా హైకోర్టుకు అనుకూలమని మీడియాలో ప్రకటన చేసి అమరావతి రాజధాని కావాలని రాష్ట్ర బీజేపీ నేతలు మద్దతు తెలపడంపై ధ్వజమెత్తారు. ఏపీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమరావతి కోసం ఉద్యమించాలని చెప్పడం చాలా దుర్మార్గం జేఏసీ నాయకులు అన్నారు. రాయలసీమ ప్రజలను అన్ని పార్టీల మాదిరిగానే బిజెపి కూడా మోసం చేస్తుందని మండిపడ్డారు. నిజంగా రాష్ట్ర బిజెపికి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా గుర్తించి, కేంద్రం నుంచి 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూల్ లో న్యాయ రాజధానికి అనుకూలమని ప్రకటన చేయించాలన్నారు. విభజన చట్టం హామీ ప్రకారం రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాయలసీమ ప్రాంత రైతులు ఆత్మహత్య చేసుకోకుండా కేంద్రం రైతు కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకోవాలన్న జేఏసీ నేతలు… కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతం పౌరుషానికి మారుపేరు అని, సీమ ప్రాంతంలో సిక్ రెజిమెంట్ మాదిరిగా రాయలసీమ రెజిమెంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ  యువకులకు ఆర్మీలో పని చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పై అమరావతి ప్రాంత రైతులు దాడిని గుర్తు పెట్టుకొని అమరావతి రైతుల మనస్తత్వం ఏంటిదో బిజెపి నేతలు గుర్తించాలన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కోస్తా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టే.. రాష్ట్ర బిజెపి నాయకులు మొత్తం అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement