Saturday, April 27, 2024

జ్యోతిర్లింగ దర్శనానికి క్యూ.. శ్రీశైలనికి పోటెత్తిన భక్తజనం..

శ్రీశైలం, ప్రభాన్యూస్‌: కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్క‌టైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేకువజామునే భక్తులు కృష్ణా నదిలో స్నానాలు చేసి.. కార్తీక దీపాలు వదిలి అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం 3.30గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, ప్రదోషకాల పూజలు నిర్వహించారు. 5.30 గంటలకు స్వామి, అమ్మవార్ల దర్శనాలకు భక్తులను అనుమతించారు. గర్భాలయంలో స్పర్శ దర్శనాలను నిలిపివేశారు.

శ్రీఘ్ర, అతి శీఘ్ర, ఉచిత క్యూలైన్లలో భారీగా భక్తులు బారులు తీరగా.. దర్శనానికి దాదాపు రెండు గంటల వరకు సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్లలో భక్తులకు పాలు, అల్పాహారం అందించారు. అలాగే ఉదయం 10.30 గంటల భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా ఉత్తరమాడ వీధి, గంగాధర మండపం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులు లక్ష వొత్తుల నోములు సైతం నిర్వహించుకున్నారు. సుమారు 30వేల మందికిపైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement