Friday, April 26, 2024

Followup: కరాటే క్లాసుల ముసుగు, ఉగ్రవాద కార్యకలాపాలే టార్గెట్.. నలుగురు అరెస్టు

కరాటే క్లాసుల ముసుగులో యువతను చేరదీయడం.. వారిలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం.. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న ఏపీ, తెలంగాణలోని నలుగురు  వ్యక్తులను జాతీయ భద్రతా సంస్థ (ఎన్​ఐఏ) అరెస్టు చేసింది. ఇవ్వాల ఉదయం నుంచి ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో 40 ప్రాంతాల్లో స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టిన ఎన్​ఐఏ బృందాలు ఎట్టకేలకు పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్​ పరికరాలతో పాటు  కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ఉగ్రవాద కార్యకలాపాలే లక్ష్యంగా.. మత విద్వేశాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలను పెంపొందించేలా శిక్షణా శిబిరాలను నడుపుతున్నారనే ఆరోపణలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇవ్వాల (ఆదివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 40 చోట్ల నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (NIA) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. తెలంగాణలోని 38, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాల్లో ఎన్​ఐఏ ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్‌లు, రెండు బాకులు(పిడికత్తులు), 8.31 లక్షల రూపాలకుపైగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికార ప్రతినిధి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో మొదట జులై 4న PFIకి వ్యతిరేకంగా కేసు నమోదు అయ్యింది. ఇందులో నలుగురు నిందితులు – అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మోబిన్​ని – రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. దీని దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్‌ఐఏ ఆగస్టు 26న కేసును మళ్లీ నమోదు చేసిందని అధికార ప్రతినిధి తెలిపారు. తెలంగాణలో నిజామాబాద్‌లో 23, జగిత్యాలలో 7, హైదరాబాద్‌లో 4, నిర్మల్‌లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్క చోట్ల ఇవ్వాల సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాదర్‌తో పాటు మరో 26 మంది వ్యక్తులకు సంబంధించిన కేసులో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సోదాలు నిర్వహించామని అధికారి తెలిపారు.

- Advertisement -

ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు, మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చేందుకు నిందితులు క్యాంపులు నిర్వహిస్తున్నారని ఎన్​ఐఏ అధికారులు ఆరోపించారు. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడ్డారని కూడా వారిపై అభియోగాలు మోపారు. “పిఎఫ్‌ఐ సభ్యులు కరాటే తరగతుల పేరుతో యువతకు కోచింగ్, శారీరక వ్యాయామాలు ప్రారంభించారు. వారి అసహ్యకరమైన ప్రసంగాలతో ఒక నిర్దిష్ట సమాజానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేవారు” అని ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్​ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement