Sunday, April 28, 2024

తీర గ్రామాల‌లో కొత్త వెలుగులు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఓడరేవులు, పరిశ్రమల రాకతో తీరప్రాంత గ్రామాల్లో కొత్త వెలుగులు కనిపిస్తు న్నాయి. ముఖ్యం గా మత్స్యకారుల జీవనవిధానంలోనూ, ఆర్థిక అభివృద్ధిలోనూ సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల రాకతో భూములను కోల్పోయామనే మాటల నుంచి వినూత్న విధానం తో సాంకేతికను అందిపుచ్చుకుని అందుబాటులో ఉన్న భూముల్లో పంటలను సాగుచేసుకుంటూ అభివృద్ధి వైపు శరవే గంగా అడుగులు వేస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల ను పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దాలని రూపొందిస్తున్న సరికొత్త ప్రణాళికలు కూడా తీర ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడు తున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం మత్స్యకార ప్రాంతాలతో పోలిస్తే ప్రస్తుతం వందరెట్లు మెరుగ్గా కనిపిస్తున్నాయి. రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలతో పాటు తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం దశలవారీగా ఏర్పాటు చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీర గ్రామాల్లో గతంకంటే భిన్నంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కారిడార్‌ల ఏర్పాటుకు ప్రధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా విశాఖ – చెన్నైల మధ్య రాష్ట్ర తీరాన్ని కలుపుతూ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా చేపడుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కొత్తగా నౌక కేంద్రాలతో పాటు మరికొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయబోతుంది. అందుకు సంబంధించిన పనులు కూడా ఊపందుకున్నాయి. వీటితో పాటు గతంలో నెలకొల్పిన వివిధ పరిశ్రమలు తమ తమ ఉత్పత్తులను ప్రారంభించడంతో పాటు పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచే ప్రయ త్నం చేస్తున్నాయి. ఫలితంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్తగా రహదారుల ని ర్మాణంతో పాటు ఆయా గ్రామాల పరిధిలో అవసరమైన సౌకర్యాలను కూడా అంతే వేగంగా చేపడుతున్నారు. అందుకు అవసరమైన భవన సముదాయాలను అత్యంత ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీర గ్రామాల ముఖచిత్రం మారబోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 1,575కు పైగా తీర ప్రాంతాలు
రాష్ట్రంలో తడ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 975 కిలో మీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పరిధిలో మత్స్యకార గ్రామాలు సుమారు 1575కు పైగా ఉన్నాయి. ఒక నెల్లూరు జిల్లాలోనే 11 మండలాల పరిధిలో 157కు పైగా మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాలు మత్స్యకారులతో పాటు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పించాయి. అందుకోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో అవి మత్స్యకారుల దరి చేరకపోవడం, ఆయా ప్రాంతాల అభివృద్ధి వైపు ప్రత్యేక దృష్టిని కూడా సారించకపోవడంతో దశాబ్దాలుగా తీర ప్రాంత ప్రజలు అనేక సమస్యలతో సమమతమవుతూనే ఉన్నారు. అయితే గత అయిదేళ్లుగా తీర ప్రాంతాల అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వంతో పాటు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాయి. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు రంగంలోకి దిగాయి. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం తీర ప్రాంతాలతో పాటు వారి ఆర్థిక విధానంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఓడరేవులు, పరిశ్రమలు ఏర్పాటుతో… మరింత అభివృద్ధి
ఇతర రవాణాతో పోలిస్తే జల రవాణాకు చాలా ప్రాధాన్యత ఉంది. జాతీయ స్థాయిలో ఎగుమతి, దిగుమతులను రైలు, రోడ్డు మార్గాన రవాణా చేసుకునే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేయాలన్నా జల రవాణా ప్రధాన మార్గం. దీంతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు తీర ప్రాంతాల్లో కొత్తగా ఓడరేవులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సరిహద్దులో రామాయపట్నం వద్ద ఓడరేవును నిర్మిస్తుంది. అందుకు అవసరమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోర్టు నిర్మాణ పనులు పూర్తి అయ్యే లోపు ఆయా ప్రాంతాల పరిధిలో మరికొన్ని పరిశ్రమలను నెలకొల్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. అందుకోసం సుమారు 5వేల ఎకరాల భూములను కూడా సేకరిస్తున్నారు. దీంతో ఉలవపాడు, గుడ్లూరు, కావలి మండలాల పరిధిలోని తీర ప్రాంతాల్లో మరికొన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే రహదారుల నిర్మాణం కూడా జోరుగా సాగుతుంది. వీటితో పాటు నెల్లూరు, కావలి మధ్యలో బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. దీంతో బోగోలు, అల్లూరు మండలాల పరిధిలోని తీర గ్రామాల్లో అనేక కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని మత్స్యకార ప్రాంతాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమా లను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది.
జాతీయ రహదారులను .. మరిపిస్తున్న తీర ప్రాంత రోడ్లు
ఇప్పటికే విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల్లో ఓడరేవుల్లో ఎగుమతులు, దిగుమతులు ఊపందుకున్నాయి. ఆయా దేశాల నుంచి నిత్యం భారీ నౌకలు లంగరు వేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలో ఏర్పాటైన పరిశ్రమల్లో తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి నిత్యం వివిధ రకాల ఉత్పత్తులు ఓడరేవులకు తీసుకురావడం, అదే విధంగా సమీప ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు నిత్యం వివిధ ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం పరిశ్రమలు ఏర్పాటైన, ఏర్పాటు కాబోతున్న తీర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ రహదారులను మరిపించేలా తీర ప్రాంతాల్లో రహదారులు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు పరిధిలోని తీర ప్రాంతాలైన పైనంపురం, నేలటూరుపాళెం, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొత్త రహదారుల నిర్మాణం చేపట్టారు. నాలుగు లైన్ల రహదారులతో ఆయా ప్రాంతాలు జాతీయ రహదారులను తలపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ వాటిని కూడా మరమ్మతులు చేపట్టి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
వారి ఆర్థిక విధానంలోనూ… భారీ మార్పులు
తీర ప్రాంతాల్లో గతంలో మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన జీవనాధారం. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, ఓడరేవులు రాకతో కొంతమంది మత్స్యకా రులు ఆయా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకుంటున్నారు. మరికొంత మంది చేపల వేటను కొనసాగిస్తూనే అందుబాటులో ఉన్న వ్యవసాయ భూముల్లో వరి , వేరుశనగ, తదితర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో వారి ఆర్థిక విధానంలోనూ గతం కంటే భిన్నంగా మార్పులు కనిపిస్తున్నాయి. పరిశ్రమల రాకతో మత్స్యకారుల ఆర్థిక ముఖచిత్రంలో కూడా మార్పు కనిపిస్తుంది. గతంలో చేపల వేట కే పరిమితమైన తీరప్రాంత ప్రజలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా మరింత బలమైన పునాదిని నిర్మించుకుంటున్నారు. పరిశ్రమలు రాక ముందు వరకు తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులు నేడు సొంత ఇంటిని నూతన హంగులతో నిర్మించుకోవడంతో పాటు 60 శాతం మందికి పైగా సొంత వాహనాలను కూడా కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే 80 శాతం మందికి పైగా మత్స్యకారులు తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్పు చేసుకున్నారు. అదే విధంగా 70 శాతంకు పైగా తీర ప్రాంతాలు కూడా అభివృద్ధి వైపు శరవేగంగా పయనిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement