Saturday, April 27, 2024

వెంటాడుతున్న రెండో భయం : మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

ఆత్మకూరురూరల్, : కరోనా కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి గత ఏడాది ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రపంచ ప్రజలంతా ఏకమయ్యారా అన్నట్లుగా అందరి నోటా కోవిడ్ అనే ఒకే మాట పలికింది. అందరిలోనూ ఒకే భయాన్ని నింపింది. అయితే నేడు ప్రజల నిర్లక్ష్యం పుణ్యమాని మళ్లీ కోరలు చాస్తోంది.
వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధీమా, కోవిడ్ ప్రభావం తగ్గిపోయిందన్న ఆనందం వెరసి రజలు నిబంధనలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం పక్కన పెట్టేశారు. దీంతో వైరస్ నేడు తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల కారణంగా వేల సంఖ్య నుండి పదుల సంఖ్యలోకి పడిపోయిన కేసుల సంఖ్య ప్రజల నిర్లక్ష్యం పుణ్యమాని తిరిగి పుంజుకుంటోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ప్రజలు మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది.
ఆదర్శంగా నిలిచిన సర్కార్ :
కరోనా కట్టడిలో, వైరస్ బారిన పడిన వారిని గుర్తించడంలో, పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ వైరస్ గురికాకుండా తీవ్రతను తగ్గించారు. ముఖ్యంగా కోవిడ్ పరీక్షల నిర్వహణలో అన్ని రాష్ట్రాలను వెనుక్కు నెట్టి మొదటి స్థానంలో రాష్ట్రాన్ని నిలపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. ఈ నేపధ్యంలో మళ్లీ వైరస్ కోరలు చాస్తుండడంతో సర్కారు అప్రమత్తమైంది. 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
అప్రత్తమైన అధికారులు :
కరోనా కేసులు పెరుగుతుండడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పోలిసు అధికారులు ప్రతి రోజు వాహనదారులకు, దుకాణదారులకు అవగాహన కల్పిస్తున్నారు. డిఎస్పీ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి రోజు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తుండడంతో పాటు మాస్కులు కూడా అందచేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ప్రజలకు, వాహనదారులకు, ఆటోవాలాలకు కరోనా వైరస్ పై ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాస్కులు లేకుండా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ రాకేష్ ల ఆధ్వర్యంలో పట్టణంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇప్పటికే పలు వార్డులలో 45 సంవత్సరాలు నిండిన వారికి పూర్తి చేశారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే వాక్సిన్ వేసి కరోనా నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement