Tuesday, May 14, 2024

అంధ్ర‌ప్రదేశ్ గనుల శాఖకు జాతీయ అవార్డు.. అత్యుత్తమ విధానాలకు గుర్తింపు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మేజర్‌ మినరల్స్‌కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్‌ కార్యకలాపాల పర్యవేక్షణలో గనులశాఖ అధికారులు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించింది. అలాగే రెండేళ్ళకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్‌ పురస్కార్‌ కింద 2.40 కోట్ల రూపాయల ఇన్సెంటివ్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మైన్స్‌ అండ్‌ మినరల్స్‌పై జరిగిన నేషనల్‌ కాంక్లేవ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా రాష్ట్ర మైన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులు, భూగర్భ శాఖ సంచాలకులు(డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ దేశంలో మేజర్‌ మినరల్స్‌ మైనింగ్‌ను ప్రోత్సహించేందుకు ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రీయ ఖనిజ వికాస్‌ పురస్కార్‌ కింద ఇన్సెంటి-వ్‌లను కూడా అందిస్తోంది. గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ పది రకాల మేజర్‌ మినరల్స్‌కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్‌ కార్యక్రమాల పర్యవేక్షణలో చూపించిన పారదర్శకత, అత్యంత వేగంగా లీజుల జారీ, వేగంగా మైనింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించేలా చేయడంలో అత్యుత్తమ విధానాలను అవలంబించింది. దీనిపై జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన నేషనల్‌ కాంక్లేవ్‌లో మైన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ డీఎంజీ వీజీ వెంకటరెడ్డి లకు ఖనిజ వికాస్‌ పురస్కార్‌ ఇన్సెంటి వ్‌ మొత్తాలను కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌ షా అందజేశారు.

అనంతరం గతంలో కేటాయించిన మైనింగ్‌ బ్లాక్‌ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో బా-కై-్సట్‌, ఐరన్‌ ఓర్‌లకు సంబంధించి 5 కొత్త మినరల్స్‌ బ్లాక్‌లకు సంబంధించిన జియోలాజికల్‌ నివేదికలను రాష్ట్రానికి అందజేశారు. వీటికి కూడా త్వరగా ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్‌ ఆపరేషన్‌ ప్రక్రియలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్‌ రంగంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వం వల్లే జాతీయ స్థాయి గుర్తింపును సాధించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్‌ కాంక్లేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీ సిమెంట్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇవ్వడం పట్ల సదరు సంస్థ యాజమాన్యాన్ని మైన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, డీఎంజీ వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్ళు సస్టెయినబుల్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను అవలంబించిన భారతీ సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement