Sunday, May 19, 2024

రేషన్‌ కార్డుల ఏరివేతకు సిద్ధం.. గృహాలకన్నా కార్డులే ఎక్కువ‌..

కర్నూలు, (ప్రభన్యూస్‌) : అక్రమంగా రేషన్‌ కార్డులు కలిగిన వారిని గుర్తించేందుకు రంగం సిద్ధమైంది. అర్హతలేని వారు వెంటనే కార్డులను సరెండర్‌ చేయాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వీటికి సంబందించిన కొత్త నిబంధనలను సైతం తెరపైకి తెచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాల పరిదిలో ఎంతమందికి కోత పడుతుందోనని కార్డుదారుల్లో టెన్షన్‌ లేకపోలేదు. కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో సుమారు 12 లక్షలకు పైగా తెల్లకార్డులున్నాయి. వీటి ద్వార ప్రతినెల 17వేల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పాటు, ఇతర పప్పు, ఆహార ధాన్యాలను చౌక దుకాణాల ద్వార కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్న గృహాలకన్నా రేషన్‌ కార్డులు అధికంగా కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఈ విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రేషన్‌ కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించడమైంది. ప్రస్తుతం వీరందరి రేషన్‌ కార్డులు సరెండర్‌ చేయాలని ఇంతకు ముందే జిల్లా స్థాయి అధికారులు ఆదేశించడం జరిగింది. తాజాగా కేంద్రం తెచ్చిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరింత మందిరేషన్‌ కార్డు అనర్హులను ఏరివేసే అవకాశం లేకపోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల మేరకు జిల్లాలో ఎన్ని ఉంటాయో.. ఊడుతాయ తెలియని పరిస్ధితి నెలకొంది.జాతీయ ఆహార భద్రతాచట్టం- 2013 మేరకు అప్పటి ప్రభుత్వాలు రేషన్‌ కార్డులు జారీ చేశాయి. కరోనా నుంచి దారిద్య్ర రేఖకు దిగువకు ఉండి, రేషన్‌ కార్డులో ఉన్న ఒక్కొ లబ్దిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏడాది నవంబర్‌ వరకు పంపిణీ పక్రీయ కొనసాగుతుంది. దీంతో అధికారులను తప్పుుదారి పట్టించి కొంతమంది రేషన్‌ కార్డుల ద్వార రేషన్‌తో పాటు మరికొన్ని ఉచితాలు పొందుతున్నారని కేంద్రం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులు సరెండర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

నిబందనలు ఇవే..

రేషన్‌ కార్డులు కలిగి ఉండేందుకు కేంద్రం విడుదల చేసిన నిబంధనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.15వేల లోపు ఆదాయం ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. వీటితో పాటు మాగాణి భూమి 3.5 ఎకరాలోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాలోపు ఉన్న వారు రేషన్‌ కార్డులకు అర్హులుగా తేల్చారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలులోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొంది. వంద చదరపు మీటర్ల ఇల్లు, ప్లాట్‌ ఉన్న వారు, కారు, ట్రాక్టర్‌, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహాశిల్ధార్ల కార్యాలయంలో సరెండర్‌ చేయాల్సి ఉంది. ప్రోపెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించని వారు మాత్రమే రేషన్‌ కార్డులు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్లర్లు, లాయర్లు, చార్టర్‌ అకౌంటెట్లు రేషన్‌ కార్డులు పొందడానికి అనర్హులు, గతంలో రేషన్‌ కార్డు తీసుకున్న వారు ఎవరైనా ఆర్దికంగా స్ధిరపడితే సరెండర్‌ చేయాల్సిందేనని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement