Wednesday, May 8, 2024

ప్రశ్నార్థకంగా ఫ్యాన్‌ హవా, నంద్యాలలో స్పీడందుకుంటున్న సైకిల్‌!

నంద్యాల రూరల్‌ ప్రతినిధి, (ప్రభన్యూస్‌): నంద్యాల జిల్లాలో అధికార పార్టీ ప్రాభవం తగ్గుతోందా.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హవా పెరుగుతోందా అంటే పరిస్థితులు అవుననే విధంగానే గోచరిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ స్థానంతో సహా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. ప్రజలు ఇచ్చిన మహత్తర విజయాన్ని పదిల పరచుకోవడంలో క్రమేపీ వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కొందరు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత పొరపాట్లతోపాటు ప్రభుత్వం తీసుకున్న.. తీసుకుంటున్న న్నిర్ణయాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సంక్షేమం పేరిట చేస్తున్న పరిపాలన ప్రజలకు రుచించడంలేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉండటం.. నిత్యం ప్రత్యర్థి పార్టీల నాయకులు, శ్రేణులపై దాడులు, మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న

హత్యాచారాలు.. ఉపాధి రంగాలు కుదేలవడం.. హనుమంతుడి తోకలా పెరిగిపోతున్న రాష్ట్ర అప్పులు తదితర కారణాలతో ప్రజలు అసహనంతో ఉన్నారు. వీటన్నింటినీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతూ వారిని చైతన్యం చేయడంలో సఫలీకృతమవుతోంది. దీంతో సహజంగానే అధికార పార్టీపై ప్రజల్లో అసహనం, వ్యతిరేకత పెరిగిపోతున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రం, పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రమైన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే.. స్థానిక ఎమ్మెల్యే ఇటీవలి కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండటంలేదనే ఆరోపణలున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమవుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొదటినుంచి శిల్పా కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలందిస్తున్నవారికి ప్రస్తుతం అధికారపార్టీలో గుర్తింపులేకుండా పోవడం.. కనీసం ముఖ్య నాయకులతో మాట్లాడే పరిస్థితులు కూడా లేకపోవడంతో సీనియర్‌ నాయకుల్లో కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ తామై వ్యవహరించిన నాయకుల్లో ప్రముఖంగా మల్కిరెడ్డి రాజగోపాల్రెడ్డి, డాక్టర్‌ ఎస్‌.ఎం.డి. నౌమాన్‌, ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, మైనార్టీ నాయకుడు హబిబుల్లా వీరితోపాటు వైసీపీని వీడే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అసంతృప్తులను సునిశిత దృష్టితో గమనిస్తున్న టీడీపీ అలాంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అవసరమైతే అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకుపోయి వారికి పార్టీ పరంగా సముచిత గౌరవం కల్పించే బాధ్యతను కూడా స్థానిక టీడీపీ నాయకులు తీసుకుంటున్నట్లు భోగట్టా. వైఎస్సార్సీపీలో ప్రాదన్యం లభించకపోవడం టిడిపిలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు సాదర స్వాగతం లభించడం, గౌరవానికి కూడా ఏ మాత్రం టిడిపిలో భంగం కలుగదనే భరోసాతో సైకిల్‌ ఎక్కేందుకు క్యూ కడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ క్రమంలోనే అధికార పార్టీలో ముఖ్య ప్రజాప్రతినిధికి సన్నిహితంగా మెలిగిన నాయకుల్లో కొందరు పసుపు కండువాలు కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేసి ఆర్థిక, అంగబలం కలిగిన ఓ ప్రముఖ న్యాయవాది అధికారపార్టీని వీడి సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో పట్టు పెంచుకునే క్రమంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏ మాత్రం కానరావడంలేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడం, చేసేందుకు పనుల్లేకపోవడం, పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ఆస్తి, ఇంటి, చెత్త పన్నుల మోతకు తోడు మోకాటిలోతు గుంతలతో రోడ్లు, మంచినీటి కొరత ఇలా అన్ని రకాలుగా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న ప్రజలను సముదాయించడంలో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు విఫలమవుతున్నారు. వీటన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు ఎత్తిచూపుతూ అధికార పార్టీ డొల్లతనాన్ని ఎండగట్టడంలో సఫలీకృతమవుతుండటంతోనే ప్రజలు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న అధికార పార్టీ చేపట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలనుంచి నిరసనలు హోరెత్తడంతో రూటు మార్చి సామాజిక న్యాయ భేరి పేరిట మంత్రులతో బస్సు యాత్ర చేపట్టింది.

ఈ నేపథ్యంలోనే మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర నంద్యాలలో తుస్సుమంది. నంద్యాలలో భారీస్థాయిలో ప్రజలు వస్తారని భావించిన అధికార పార్టీ నాయకులకు చుక్కెదురైంది. ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసహనం పెరిగిపోయింది. దీంతో తాము చెప్పదలచుకున్న సందేశాన్ని పూర్తిగా ప్రజలకు వివరించకుండానే సభ మధ్యలోనే నిష్క్రమించి కర్నూలు బాట పట్టారు. నంద్యాల యాత్రకు పూర్వం మంత్రులు అక్కడక్కడా చేపట్టిన పర్యటనల్లో కూడా జనం పలుచగా ఉండటంతో వారిలో ఉత్సాహం సన్నగిల్లినట్లు తెలిసింది. ఈ నిరుత్సాహం, అసహనం నంద్యాల యాత్రతో పటాపంచలవుతుందని అటు మంత్రులు, ఇటు స్థానిక నేతలు భావించారు. పైగా నంద్యాల నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడం, జిల్లాలో అన్ని సీట్లు అధికార పార్టీవే కేడర్‌ కూడా బలంగా ఉండటం, సంక్షేమ కార్యక్రమాలు పెరశి తమకు ఊరటనిస్తుందన పంచారు. కానీ వారి అంచనాలు తప్పాయి. జనం పలుచగా ఉండటం, ఎండవేడిమి భరించలేక వచ్చిన జనం కూడా మంత్రులు సభకు వచ్చేలోగానే మెల్లగా జారుకున్నారు. అరకొరగా ఉన్న జనం, డ్వాక్రా మహిళలు మాత్రం ఎండలోనే తలలపై తట్టా, బుట్టలతో మంత్రులు ప్రసంగాలు విన్నారు.

- Advertisement -

మంత్రుల సామాజిక న్యాభేరి యాత్రకు భారీగా ప్రజలు హాజరవుతారని ఆశించినా కుర్చీల్లో సింహభాగం ఖాళీగానే కనిపించాయి. జనంలేకపోవడంతో మంత్రులు త్వరగా ప్రసంగాలు ముగించి వెళ్లిపోయారు. ఇటీ-వల తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో ఎలాగైనా టీడీపీకి చెక్‌ పెట్టి జనం తమ వెంటే ఉన్నారని నిరూపించుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే సామాజిక న్యాయ భేరి పేరి మంత్రులతో బస్సు యాత్ర చేపట్టింది. కేబినెట్లోని వివిధ సామాజిక వర్గాలకు చెంది మంత్రులందరినీ బస్సులో పంపుతూ జనంలో పట్టునిలుపుకునేందుకు ప్రయత్నించింది. నంద్యాల జిల్లాలో తమ సత్తా చాటి ప్రతిపక్షానికి దీటుగా సవాల్‌ విసరాలని భావించిన అధికా పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఈ పరిణామాన్ని అధికార పార్టీ నేతలు ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఇదే పరిణామాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒక అస్త్రంలా చేసుకొని ప్రజలకు చేరువై వారి మన్నన పొందడానికి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి నూకలు చెల్లాయని, రాబోయేది తమ ప్రభుత్వమేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రజల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ఈ బస్సు యాత్రే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల తమ పార్టీ నిర్వహించిన మహానాడు దిగ్విజయం కావడం, అధికార పార్టీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర విఫలం కావడం తమకు శుభసూచకమని వారు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement