Thursday, September 21, 2023

జగన్ కి మిగిలింది ఆరు నెలలే …. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడుచుకు పెట్టుకు పోవడం ఖాయం- తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్

రాజమండ్రీ – టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు జరిగిన ములాఖత్ ఆంధ్రపద్రేశ్ కు చాలా అవసరమని జనసేనాని పవన్ చెప్పారు. తాను ఎన్డీయేలో ఉన్నానని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని… ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్ కు కూడా చెప్పానని, వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేనది తనకు తెలియదని చెప్పారు..రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, యువనేత నారా లోకేశ్ సమావేశం ముగిసింది. వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెపుతున్నానని, 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు.

- Advertisement -
   

. ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని, ఇప్పుడే పొత్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు. జగన్ కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు. ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు.

బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. పోలీసులపై తనకు ఎంతో గౌరవం ఉందని… కానీ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జగన్ ను నమ్ముకున్న వైసీపీ నేతలందరికీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నానని… చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. 6 నెలల తర్వాత టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. మీరు యుద్ధమే కోరుకుంటే… యుద్ధానికి తాము సిద్ధమని చెప్పారు..

ఒక హార్డ్ కోర్ నేరస్తుడు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబును జైల్లో పెట్టించడం బాధాకరం. ఈడీ కేసులు ఉన్న వ్యక్తి, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు చేసే వ్యక్తి, విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతులు తీసుకునే వ్యక్తి, అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని 2020లోనే చెప్పాను. అప్పుడే వైసీపీ ప్రభుత్వం పద్ధతిగా పాలన సాగించి ఉంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, నారా లోకేశ్ మధ్యన నిల్చొని మాట్లాడే పరిస్థితి నాకు వచ్చేది కాదు” అని అన్నారు

.ఈ సందర్భంగా చంద్రబాబుతో మీరు ఏం మాట్లాడారంటూ ఒక మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. మీ ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును అడిగానని చెప్పారు. మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉందని చెప్పానని అన్నారు. పాలసీల పరంగా గతంలో మీతో విభేదించానని, కానీ వ్యక్తిగతంగా మీమీద తనకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అక్కడున్న అధికారులను అడిగానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement