Wednesday, May 8, 2024

Big Story | విద్యుత్‌ వెలుగులు.. ఉత్పత్తిలో ఏపీ జెన్‌కో రికార్డు!

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్‌కో) విద్యుత్‌ ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేస్తోంది. మే నెలలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీ జెన్‌కో 12 శాతం అధికంగా విద్యుత్‌ సరఫరా చేసింది. రాష్ట్ర విద్యుత్‌ డిమాండులో ఏపీ జెన్‌కో గత ఏడాది మే నెల 33.45 శాతం సమకూర్చగా ఈ ఏడాది అదే నెలలో అంచనాలకు మించి 45.38 శాతం గ్రిడ్‌కు అందించడం గమనార్హం. గత మేలో రాష్ట్ర గ్రిడ్‌ విద్యుత్‌ డిమాండు 5947.39 మిలియన్‌ యూనిట్లు- కాగా ఏపీ జెన్‌కో 1989.37 మిలియన్‌ యూనిట్లు సమకూర్చింది.

ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 6430.72 మిలియన్‌ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్‌కో 2917.99 మిలియన్‌ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించిది. ఏపీ జెన్‌కో రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర గ్రిడ్‌కు గత సంవత్సరం మేనెలలో సరఫరా చేసిన విద్యుత్‌ కంటే ఈ సంవత్సరం మేనెలలో 989.37 మిలియన్‌ యూనిట్లు అధికంగా సరఫరా చేయడం విశేషం. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా విద్యుత్‌ వినియోగం పెరిగిన సమయంలో సైతం ఏపీ జెన్‌కో సగటున 45 శాతానికి పైగా సమకూర్చుతుండటం విశేషం.

జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంవల్ల ఆమేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన భారం తగ్గినట్లే. ఈ మేరకు విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పెంపు భారం తప్పింది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశం. గత వేసవి సీజన్లలో లాగే ఈ ఏడాది మేలో కూడా డిమాండు సాధారణంగా ఉండి ఉంటే ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా వాటా 50 శాతం దాటి ఉండేదని గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది.

‘సాగర్‌’ రికార్డు
నాగార్జునసాగర్‌ కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నలబై ఏళ్లలో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్‌ యూనిట్ల అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టు నలబై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్లాంట్లలో ఉద్యోగులు అంకిత భావంతో కృషి చేయడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చక్కటి మార్గదర్శకంతో ప్రోత్సహించడంవల్లే ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి పెరిగిందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) పెరగడానికి పాటు-పడినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్‌కో ఛైర్మన్‌ కే విజయానంద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు ఉద్యోగులను అభినందించారు.

- Advertisement -

డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (డాక్టర్‌ ఎన్‌టీ-టీ-పీఎస్‌)లో ఇటీ-వల ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి వచ్చే నెల శ్రీకారం చుడతామని ఎండీ ఉద్యోగులకు తెలిపారు. దీంతో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్థ్యం 5810 మెగావాట్ల నుంచి 6610 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్‌కో (థర్మల్‌, హైడల్‌, సోలార్‌ కలిపి) మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థం 8789.026 మెగావాట్లకు పెరగనుంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక : ఎండీ చక్రధర్‌ బాబు
విద్యుత్‌ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంపూర్ణ సహాయ, సహకారాలతో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింతగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నామని జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర బాబు తెలిపారు. ప్రతి యేటా విద్యుత్‌ డిమాండ్‌ 8 శాతం పెరుగుతోందని, ఈవిషయాన్ని దృష్టిలో పెట్టు-కుని రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో అత్యధిక భాగం సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో ఏపీ జెన్‌కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం చేశారని వివరించారు.

వారి మార్గదర్శకత్వం మేరకు 5000 మెగావాట్ల సామర్థంగల పంప్డ్‌ స్టోరేజి ప్లాంట్ల (పీఎస్పీ) ఏర్పాటు-కు ప్రణాళిక రూపొందించామని వివరించారు. పీక్‌ డిమాండ్‌ సమయంలో ఉత్పత్తి పెంచడానికి, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి హఠాత్తుగా పడిపోయినప్పుడు గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు పీఎస్పీలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. పీక్‌ డిమాండ్‌ సమయంలో అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన భారం కూడా వీటివల్ల తప్పుతుందని వెల్లడించారు. ఈ ఆలోచనతోనే అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల పీఎస్పీ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. దీని నిర్మాణానికి -టె-ండరు డాక్యుమెంటు-ను జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ- ఆమోదించిందని, త్వరలోనే రూ. 11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టె-ండర్లు పిలవనున్నామని చెప్పారు.

‘మాచ్‌ఖండ్‌’పై 98 మెగావాట్లతో మూడు ప్రాజెక్టులు
మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్‌కో సంయుక్తంగా మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థంగల మూడు జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటు-న్నామని తెలిపారు. ఇతర చిన్న జలవిద్యుత్‌ కేంద్రాల మాదిరి ఇది సీజన్‌లో పనిచేసేది కాదన్న ఆయన ఏడాది పొడవునా విద్యుత్‌ ఉత్పత్తి చేయనుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement