Wednesday, May 22, 2024

వరికి మద్దతు ధర పెంపుపై అన్నదాతల అసంతృప్తి..

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2023-24కు సంబంధించి వరి పంటకు మద్దతు ధర పెంపుపై అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. పెట్టుబడికి.. మద్దతు ధరకు సంబంధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరే విధంగా లేని పరిస్థితి నెలకొందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ప్రధానమైన పంటల్లో వరికి అగ్రస్థానం ఉంది. అలాగే , గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పాక్షికంగా వరి సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌, రబీలో కలిపి 20 లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా డెల్టాలో వరి తప్ప రైతులకు వేరే ప్రత్యామ్నాయం సైతం లేని పరిస్థితి ఉంది.

రైతులకు మద్దతు ధర అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన న్యాయం చేయక పోవడంతో ఏడాదికేడాది అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కంటితుడుపు చర్యగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023-24కు సంబంధించి వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొన్నటి వరకూ క్వింటాల్‌ వరికి రూ.2040 ఉండే ధర ఇప్పుడు రూ.2,183కే చేరింది. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర రైతులకు అందించాల్సివుంది. ఆ విధంగా రైతులకు ధర అందాలంటే ప్రభుత్వం క్వింటాల్‌ వరికి రూ.2,707 ధర ఇవ్వాల్సి ఉంది. అయితే కేంద్రం ఆ విధంగా చేయకుండా నామ మాత్రంగా ధర ప్రకటించిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దీంతో రైతులు క్వింటాల్‌కు ధర రూపంలో రూ.524 నష్టపోతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం పంటలకు ప్రకటించిన ధరలను చూస్తే అర్థమవుతోందనే విమర్శలు వున్నాయి. వాస్తవ ధరలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తాము ప్రకటించిన ధరనే మద్దతు ధర అన్నట్లు కేంద్రం వాదిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలు ఏడాదికే డాది ఆకాశాన్నంటాయి. దీంతో వ్యవసాయ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. ప్రస్తుతం 20-20-0 ఎరువు బస్తా ఖరీదు రూ.1700కు చేరగా, 28-28-0 ఎరువు ధర సైతం రూ.1700 పలుకుతోంది.

- Advertisement -

14-35-14, 10-26-26, పోటాస్‌ వంటి ధరలు సైతం బస్తా రూ.1700కు చేరాయి. డిఎపి బస్తా రూ.1350 వరకూ విక్రయిస్తున్నారు. డీజిల్‌ ధరల పెరుగుదలతో దుక్కుల ధరలు పెద్దఎత్తున పెరిగిపోయాయి. గతంలో సాలుకు రూ.600 ఉండగా ఇప్పుడు సాలుకు రూ.1200కుపైగా చేరింది. కిరాయి ధరలు గతంలో బస్తాకు రూ.పది ఉంటే ఇప్పుడు రూ.20 వరకూ వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి రేట్లు- సైతం పెరిగాయి. దీంతో ఎకరా సాగుకు రబీలో దాదాపు రూ.49 వేలు వరకూ పెట్టుబడి ఖర్చవుతున్న పరిస్థితి నెలకొంది.

ఉత్పత్తి ఖర్చులకు తగ్గట్లు మద్దతు ధర లేదు..

కేంద్రం వరికి ప్రకటించిన ధర పెంపు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా లేకుండాపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా మద్దతు ధర ప్రకటించాలి. వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ధర ప్రకటిస్తోంది. పురుగుమందులు, ఎరువులు, దుక్కుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మద్దతు ధర గ్యారెంటీ చట్టం తెచ్చినప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఎకరా వరిసాగుకు రూ.49 వేలు వరకూ ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1637గా ధర నిర్ణయం కానుంది.

ఎకరాకు రబీలో సరాసరిన 45 బస్తాల దిగుబడి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం రూ.73,665 ఆదాయం వస్తోంది. దీనిలో 15 బస్తాల కౌలు సొమ్ము రూ.24,555 భూయజమానికి చెల్లించాలి. ఇంకా పండిన పంటలో మిగిలే సొమ్ము రూ.49,110 మాత్రమే. పెట్టుబడికి వడ్డీ కలుపుకుంటే రైతుకు అప్పులే శరణ్యమన్నట్లు వరిసాగు తయారైంది. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తే భారీగా రైతులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదంతా ప్రభుత్వం ప్రకటించిన ధర వస్తేనే ప్రకృతి వైపరీత్యాలు, దళారుల వ్యవస్థ కారణంగా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ధర ఎక్కడా సవ్యంగా అందడం లేదు.

దీంతో రైతు ఆరుగాలం కష్టపడినా వరిసాగులో మిగులనేది లేకుండాపోతుంది. వాస్తవ ఖర్చులను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం మద్దతు ధరన నామ మాత్రంగా పెంచేసి చేతులు దులుపుకుంటు-న్న రైతు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం ప్రకటించిన ధరతో వరిరైతులు తీవ్రనష్టాల్లో కూరుకుపోవడంతో కేరళ ప్రభుత్వం క్వింటాల్‌కు బోనస్‌గా రూ.780 ఇస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం వరి రైతులకు బోనస్‌ ఇస్తే రైతుల అప్పుల ఊబిలో నుంచి బయట పడే అవకాశాలు వున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement