Tuesday, April 30, 2024

AP | కృష్ణాలో అవే వాటాలు.. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులే ఫైనల్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్ర జలశక్తి 2023-24 నీటి సంవత్సరంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడటం లేదు. 50:50 ప్రాతిపదికన కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ పట్టుబడుతున్నప్పటికీ బచావత్‌ ‘ట్రిబ్యునల్‌ ను అనుసరించి 66:34 నిష్పత్తినే కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. వేసవికాలం పూర్తయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయం దగ్గర పడుతుంటంతో ఎగువన వర్షాలు పడితే కృష్ణాలో ప్రధాన ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలంకు వరదలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో వాటాలను తేల్చాలని రెండు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. దీనిపై గత ఏడాది దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో రిజర్వాయర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) ఏర్పాటయింది.

రెండు రాష్ట్రాల్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ లతో పాటు జెన్‌ కో ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్‌ వరకు అనేకసార్లు ఆర్‌ఎంసీ సమావేశమైనా కృష్ణా జలాల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరలేదు. 50:50 నిష్పత్తిపై తెలంగాణ పట్టుబడుతుండగా, ఏపీ ససేమిరా అంటోంది. రాష్ట్ర పునర్విభజన అనంతరం బచావత్‌ టైబ్యునల్‌ అవార్డు ప్రకారం ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను తిరగదోడటం చట్టరీత్యా సాధ్యం కాదని ఏపీ స్పష్టం చేస్తోంది. పునర్విభజన అనంతరం 2015 జూలై 19న కేంద్ర జలశక్తి ముందు కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తి వాటాలపై ఏపీతో పాటు తెలంగాణ అధికారులు సంతకాలు చేశారు. ఈ మేరకు బచావత్‌ టైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల గణాంకాలను లెక్కకట్టి ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించారు.

బచావత్‌ టైబ్యునల్‌ కేటాయింపులను సరిచేసే అధికారం ఎవరికీ లేదనీ, బ్రజేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటయిన కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కెడబ్ల్యుడీటీ-2) తుది తీర్పు వెలువడే వరకు ఇవే కేటాయింపులు వర్తిస్తాయని ఏపీ చెబుతోంది. రెండు రాష్ట్రాల్ర మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంలో సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం కేడబ్ల్యుడీటీ -2కు సైతం పూర్వ కేటాయింపులకు జోలికి వెళ్ళే అధికారం లేదు..నీటి లభ్యత 65-75 శాతం ప్రాతిపదికన లెక్కించినపుడు అదనపు జలాలను రెండు రాష్ట్రాల్రకే కేటాయించేందుకు బ్రజేష్‌ కుమార్‌ టైబ్యునల్‌ పరిమితమవుతుందన్న సంగతిని తెలుసుకోవాలి.. ఈ నేపథ్యంలో తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న 50:50 నిష్పత్తిని సమ్మతించే ప్రస్తక్తే లేదని ఏపీ చెబుతోంది.

- Advertisement -

ఎప్పటి లెక్క అప్పుడే..!

ఒక ఏడాదిలో ఏ కారణం వల్లనైనా కృష్ణాలో కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోని పక్షంలో క్యారీ ఓవర్‌ జలాలను మరుసటి సంవత్సరం వాడుకునేలా వెసులుబాటు కల్పించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుండగా ఏపీ వ్యతిరేకిస్తోంది. క్యారీ ఓవర్‌ జలాలను మరుసటి ఏడాది కలపటం సాంకేతికంగా సాధ్యం కాదని బోర్డు చెబుతోంది. దీనిపై కేంద్ర జల సంఘం కూడా క్యారీ ఓవర్‌ జలాలను లెక్కించి మరుసటి సంవత్సరం వినియోగించునే విధానాన్ని అంగీకరించటం లేదు. అంతేకాకుండా కృష్ణా జలాల్లో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకునే నీటిలో 20 శాతమే లెక్కించాలనీ, రాజోలుబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) కుడి కాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలనీ, ఆర్డీఎస్‌ అధునీకరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తోంది.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు మరిన్ని టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ వాదనను కూడా ఏపీ తిప్పికొడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎగువ నుంచి తరలించేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగీరథ, కల్వకుర్తి (సామర్థం పెంపు), నె-్టట-ంపాడు (సామర్థం పెంపు) ప్రాజెక్టు పనులు చేస్తోందని ఏపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో 66:34 నిష్పత్తి వాటాలను అమలు చేయటమే కాకుండా తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకోవాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement