Saturday, April 27, 2024

మార్చి 18న శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం

తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 18వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం మార్చి 17వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం .

ఇందులో భాగంగా మార్చి 18న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement