Thursday, May 2, 2024

పోలీస్ త్యాగాలు వెలకట్టలేనివి .. ఏపీ డిప్యూటీ సీఎం

తిరుపతి : పోలీస్ త్యాగాలు వెల కట్టలేనివని జిల్లా ఇన్చార్జి మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. ఈ ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా డిప్యూటి సీఎం, అతిధులుగా జిల్లా కలెక్టర్ కె.వెంకరమణ రెడ్డి, జిల్లా జడ్జి వీర్రాజు, జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు నివాళులర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ.. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకోవడం మన విధి అని, దేశం కోసం త్రుణపాయంగా పోలీసులు ప్రాణాలనర్పిస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని, విధినిర్వహణలో మరణించిన వారికి అందించే పరిహారం, కారుణ్య నియామకం అమలు చేస్తుందని, దీనికి తోడుగా హోంగార్డుల సంక్షేమం కోసం ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10లక్షలు, సర్వీస్ లో ఉన్న హోంగార్డులు సహజంగా మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తూ అండగా ఉందన్నారు.

జిల్లా ఎస్ పి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి ప్రతి ఏటా అక్టోబర్ 21న వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. మనదేశంలో 2021 సెప్టెంబర్ మాసం నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు 261 మంది అసువులు బాశారన్నారు. నేడు మన జిల్లాలో మరణించిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు వారి చేసిన సేవలకు చిన్నపాటి సన్మానం, రావలసిన పరిహారం అందిస్తున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ సుప్రజా దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల పేర్లను చదువుతూ వారిని స్మరిస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులతో సహా అందరూ అమర వీరుల స్థూపం వద్ద ఘన నివాళులర్పించి, రెండు నిముషాల మౌనం పాటించారు. జిల్లాలో అమరులైన పోలీసులు సుకన్య, వాసు, వరలక్ష్మి, మునిరత్నం, ప్రభాకర్, సుబ్రమణ్యం, వెంకటముని రాజుల కుటుంబాలను సన్మానించి, ఫోటోతో కూడిన ప్రశంసాపత్రం అందజేసి, వారికి అందించాల్సిన పరిహార చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు అందించి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, శాసన మండలి సభ్యులు కళ్యాణ చక్రవర్తి, జిల్లాలోని శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేయర్ శిరీషా, నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటి మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ వెంకటేష్, జిల్లా అధికారులు పాల్గొని అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జిల్లా అమర వీరుల సన్మానంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement