Wednesday, May 8, 2024

Big Story: విద్యుత్‌ సంస్కరణలు.. ‘పవర్‌’పై కన్నేసిన కేంద్రం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ శాఖలో సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. వాటి అమలకు శరవేగంగా అడుగులు వేస్తోంది. సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలన్న నిర్ణయంతో నూతన విద్యుత్‌ లైన్లు, అభివృద్ధికి జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అభివృద్ధి, నిర్మాణల కోసం దేశ వ్యాప్తంగా పని చేస్తున్న ప్రాంతీయ విద్యుత్‌ కమిటీలను కేంద్ర విద్యుత్‌ శాఖ రద్దు చేసింది.

ఈ ప్రాంతీయ విద్యుత్‌ కమిటీల వల్ల వివిధ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సరఫరా వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని, అందుకే ప్రాంతీయ విద్యుత్‌ కమిటీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ చెబుతోంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలకు ఈ కమిటీలు వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్‌కో సంస్థల డైరెక్టర్లు దక్షిణ ప్రాంతీయ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రాంతీయ కమిటీల రద్దుతో అంతర్రాష్ట విద్యుత్‌ లైన్ల నిర్మాణం, అభివృద్ధిలో ఆయా రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్‌కోల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. దీంతో పూర్తిగా కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్ణయాల మేరకే అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

దేశంలో పవన, సౌర విద్యుత్‌ వంటి సంప్రదాయేత ఇంధనం (ఆర్‌ఈ) ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 4,30,000 మెగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి 1 లక్షా 3 వేల మెగావాట్లు ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మించేందుకు 18 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆ కేంద్రం నుంచి విద్యుత్‌ తీసుకోవడానికి అవసరమైన విద్యుత్‌ లైన్ల నిర్మాణానికి మరో 18 నెలల నుంచి 24 నెలల సమయం పట్టవచ్చని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

సాధారణంగా కేంద్ర విద్యుత్‌ మండలి ప్రాంతీయ విద్యుత్‌ కమిటీలతో చర్చించి అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా లైన్ల విస్తరణా ప్రాణాళికను తయారు చేస్తుంది. ప్రాంతీయ కమిటీలు చేసిన సిఫారసులను జాతీయ విద్యుత్‌ కమిటీ పరిశీలించి ఆమోదించాక.. కొత్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం జరగాలనేది ఇంత వరకు ఉన్న నిబంధన. ప్రాంతీయ కమిటీలను అప్పటి అవసరాలను బట్టి 2005లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సంప్రదాయేతర ఇంధన కేంద్రాలు శరవేగంగా జరుగుతున్నందున విద్యుత్‌ సరఫరా వ్యవస్థను వేగంగా విస్తరించాల్సి ఉంది. ప్రాంతీయ కమిటీలతో సంబంధం లేకుండా జాతీయ కమిటీలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందునే వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement