Sunday, September 24, 2023

జ‌గ‌న్ కేబినేట్ 3.0 ప్ర‌క్షాళ‌న‌కు స‌ర్వం సిద్ధం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఇప్పటికే రెండు సార్లు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసిన సీఎం జగన్‌ మూడోసారి మార్పులకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కలిసొస్తే ఏప్రిల్‌ మొదటి వారంలోనే నలుగురికి ఉద్వాసన పలికి వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తాడేపల్లి కేంద్రంగా చోటుచేసుకుం టున్న రాజకీయ సంఘటనలనుబట్టి చూస్తుంటే ఇదంతా నిజమేననిపిస్తున్నది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు శనివారం అందుబాటులో ఉండాలని సీఎంవో నుండి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. మరో మంత్రిని కోస్తా ఆంధ్ర పరిధిలో వారే కావడంతో ఫోన్‌చేసి పిలిపించే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు. సోమవారం నాటి గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌ షాపులో మంత్రివర్గ మార్పుపై క్లారిటీ ఇచ్చే క్రమంలో అందుకు సంబంధించిన నలుగురు మంత్రులకు ముందస్తుగానే వారితో చర్చించి మార్పుకు గల కారణాలను వివరించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సమాచారం పంపినట్లు తెలిసింది. దీనినిబట్టి చూస్తుంటే రానున్న వారంలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
   


రెండు రోజుల ఢిల్లిd పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్‌ తన కసరత్తులో మరింత వేగాన్ని పెంచినట్లు తెలుస్తున్నది. ఇటు పార్టీపరంగా అటు పాలనాపరంగా ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు స్పష్టమౌతుంది. అయితే ప్రస్తుతం మార్పులు చేస్తున్న మంత్రులకు సంబంధించిన సామాజికవర్గాలకే తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా..లేక కమ్మ, రెడ్డి, కాపు, ఎస్సీ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే అంశంపై స్పష్టత రావల్సి ఉంది. సీఎం జగన్‌ మాత్రం మంత్రివర్గ విస్తరణలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ఈసారి తప్పనిసరిగా అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆ నలుగురు ఎవరన్న దానిపై ఉత్కంఠ
జగన్‌ కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉన్నారు. వారిలో ప్రస్తుతం నలుగురిని తప్పించి తిరిగి ఆస్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తూ ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్రక్రియను కూడా ఆయన మరింత వేగవంతంచేశారు. దీంతో మంత్రివర్గంలో ఆ నలుగురు ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఆ నలుగురు ఎవరన్నది అధిష్టాన పెద్దలు ఇప్పటికే ఆయా మంత్రులకు సంకేతాలిచ్చారు. అదేవిధంగా శనివారం తాడేపల్లి కార్యాలయానికి రావాలని సమాచారం కూడా ఇచ్చారు. అయితే, మంత్రివర్గం మార్పులో భాగంగా వారికి సమాచారం ఇచ్చారా ఆయా జిల్లాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పిలిపిస్తున్నారా..అనే అంశంపై కూడా స్పష్టత రావల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ నలుగురు ఎవరన్న ఆందోళన మాత్రం మంత్రివర్గాన్ని వెంటాడుతోంది.

కాపుల్లో బలమైన నేత కోసం వెతుకులాట
జగన్‌ కేబినెట్‌లో ఇప్పటికే కాపు సామాజికవర్గం నుండి ఐదు మందికి మంత్రి పదవులు దక్కాయి. అయితే, మంత్రివర్గ మార్పుల్లో భాగంగా కాపు సామాజికవర్గానికి ఒక స్థానాన్ని కేటాయించే యోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల పరిధిలో బలమైన కాపు నేతను కేబినెట్‌లోకి ఆహ్వానించడం ద్వారా ఆ ఐదు జిల్లాల పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది అధినేత యోచనగా కనిపిస్తుంది. అందుకోసమే గత వారం పది రోజులుగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు కమ్మ, రెడ్డి సామాజికవర్గానికి కూడా ప్రాధాన్యతను కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా మరో స్థానాన్ని కేటాయించే దిశగా సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తాడేపల్లిలో మంత్రి సీదిరి, స్పీకర్‌ తమ్మినేని ప్రత్యక్షం
ఈ వార్తల నేపథ్యంలో అకస్మాత్తుగా మంత్రి సీదిరి అప్పల రాజు, స్పీకర్‌ తమ్మినేని సీతారాంలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి పదవుల మార్పుల నేపథ్యంలోనే వారిరువురూ వచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. సీదిరి మంత్రి పదవి తీసి తమ్మినేనికి ఇస్తారంటూ కూడా ఒక దశలో ప్రచారం సాగింది. ఇదే సమయంలో డాక్టర్‌ అచ్చెన్న మరణం అంశానికి సంబంధించి సంబంధిత మంత్రి కాబట్టి సీదిరిని పిలిచారంటూ మరో ప్రచారం జరిగింది. అప్పుడు తమ్మినేనిని ఎందుకు పిలిపించారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బయటకు వచ్చిన అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం అసలు చర్చకు రాలేదంటూ ఇద్దరు నేతలు కొట్టిపారేశారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రక్షాళనకు రంగం సిద్ధం
గత ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీ జగన్‌ తన మంత్రివర్గాన్ని విస్తరింపజేశారు. అదేనెల 11వ తేదీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. తాజాగా ఆయన మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవల గవర్నర్‌ను కలిశారని చెబుతున్నారు. ఈక్రమంలోనే ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రక్షాళనకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఏడాది కాలం అవకాశం కల్పించినట్లు ఉంటుందన్న భావనతో ఆయన ఏప్రిల్‌ మొదటి వారాన్నే మంత్రివర్గ మార్పులకు ఎంచుకున్నట్లు చెబుతున్నారు. నలుగురు మంత్రులను మార్చడంతోపాటు మరికొంత మంది మంత్రులకు శాఖలను కూడా మార్చబోతున్నారు. ఈనేపథ్యంలో గత ఏడాదిలాగే ఏప్రిల్‌ మొదటి వారంలో మంత్రివర్గ ప్రక్షాళనకు ఆయన రంగం సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement