Friday, April 26, 2024

120 కోట్ల విలువైన భూమి స్వాధీనం.. ఆక్రమితదారులకు దేవాదాయశాఖ చెక్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆక్రమణదారులపై దేవాదాయశాఖ అధికారులు పైచేయి సాధించారు. ఏళ్ల తరబడి రకరకాల ఫిటీషన్లతో కాలయాపన చేస్తున్న ఆక్రమణదారులకు ఎట్టకేలకు అధికారులు చెక్‌ పెట్టారు. గుంటూరు నగరం ఆనుకొని ఖరీదైన ప్రాంతంలో శ్రీ ఆంజేయస్వామి వారి దేవస్థానానికి చెందిన రూ.120 కోట్ల విలువైన 16 ఎకరాల భూమిని సోమవారం అధికారులు స్వాధీనం చేసుకొని ఆలయానికి అప్పగించారు. ఆలయ భూముల స్వాధీనంలో సమర్థవంతంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన దేవాదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ హరి జవహర్‌లాల్‌..వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున వీరికి ప్రభుత్వం నుంచి ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని కొరిటిపాడు సర్వే నెం.78లో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానానికి 17 ఎకరాల 70 సెంట్ల భూమి ఉంది. అర్చకుల వేతనాలు, ఇతర ఖర్చులకు 16 ఎకరాలు ఇచ్చి మిగిలిన భూమిని ఆలయానికి ఉంచారు. వేతన స్థిరీకరణ కోరుతూ 1998లో తిరిగి తనకు ఇచ్చిన భూమిని అర్చకుడు ఆలయానికి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ భూమిని ఒంటెద్దు శ్రీనివాసరెడ్డి, మరో 11మంది ఆ భూమిని ఆక్రమించుకున్నారు. 2003లో దేవాదాయశాఖ డెప్యూటీ కమిషనర్‌ వీరిని ఆక్రమితదారులుగా గుర్తించి సెక్షన్‌ 84 ప్రకారం తొలగించాలని ఆదేశించారు.

దీనిపై తిరుపతి ఆర్జేసీ వద్ద వీరు రివిజన్‌ ఫిటీషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పూర్తి ఉత్తర్వులు వచ్చే వరకు ఎకరాకు రూ.ఐదు వేలు డామేజీగా ఆలయానికి చెల్లించాలని ఆదేశించారు. రివిజన్‌ పిటీషన్లను కాకినాడ ఆర్జేసీకి బదిలీ చేయగా అంతకు ముందుచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు చెప్పారు. దీంతో ఆక్రమితదారులు ప్రభుత్వానికి అప్పీల్‌ చేసుకోగా 2006 స్టే ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయశాఖ కౌంటర్‌ దాఖలు చేయడంతో ప్రభుత్వం గత మార్చి 4న స్టే ఉత్తర్వులను తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపధ్యంలో సోమవారం అధికారులు ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని శ్రీచైతన్యపురి ఎక్స్‌టెన్షన్‌కు సమీపంలో ఉన్న ఈ భూమి ప్రస్తుత విలువ బహిరంగ మార్కెట్లో రూ.120 కోట్ల పైమాటే. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో ఆ విలువైన భూమిని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి అప్పగించారు. భూమి స్వాధీనంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ మీనా వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారులు కురుగుంట్ల విజయ భాస్కర రెడ్డి, వైవీ కృష్ణారెడ్డి, జొన్నకూటి సాయి విశ్వనాధ్‌, పోతుల రామకోటేశ్వరరావు, పగడాల శివ కోటేశ్వరరావు, ఐ.సాంబయ్య, ఎం.నాగయ్య, వేజెంట్ల యజ్ఞనారాయణ, జక్కా శ్రీనివాసరావు, ఎల్‌ఎల్‌టీ సౌమ్య, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement