Sunday, December 8, 2024

టి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా పివి కుమార్తె వాణిదేవి – బిఫామ్ అంద‌జేసిన కెసిఆర్

హైదరాబాద్‌, : తెలంగాణ రాష్ట్రసమితి హైదరాబాద్‌, మహ బూబ్‌ నగర్‌, రంగారెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్ధిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవిని ఖరారుచేసింది. అభ్యర్ధిత్వంపై ఆదినుండి వ్యూహాత్మకంగా వ్యవహ రించిన సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా పీవీ కుమార్తెను తెరపైకి తెచ్చి విప క్షాలకు షాకిచ్చారు. బీజేపీ అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పోటీచేస్తుండగా, అదే సామాజిక వర్గా నికి చెందిన సురభి వాణీదేవిని ఎంపిక చేయడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీవీ కుమార్తె అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. వాణీదేవి సోమవారం నామినేషన్‌ దాఖలుచేయనున్నారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా చిన్నారెడ్డి పోటీచేస్తుండగా, మొత్తం 5.60లక్షల ఓటర్లున్నారు.
పక్కా వ్యూహంతోనే..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కా వ్యూహంతోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పేరును ప్రకటించారు. ఈ స్థానం కోసం బొంతు రామ్మోహన్‌, దేశపతి శ్రీనివాస్‌ వంటి పేర్లను పరిశీలించిన అధిష్టానం ఇటు బిజెపి‌, అటు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు సురభి వాణీదేవిని ఎంపికచేసింది.
ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజికవర్గ ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి. రకరకాల వ్యూహాలతో.. అభ్యర్ధిత్వాలపై సర్వేలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వాణీదేవి అభ్యర్ధిత్వంపై మొగ్గుచూపినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. పీవీ కుమార్తెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా.. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలను సిఎం కేసీఆర్‌ డిఫెన్స్‌లో పడేశారని, ప్రచారం సందర్భంగా.. వీటిని ప్రస్తావించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానానికి ఇప్పటికే పల్లా రాజేశ్వరరెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ రెండు స్థానాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టింది.
రెండింటిపై.. గెలుపు ధీమా
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు రెండూ గెలిచి తీరుతామని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేసింది. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం స్థానంలో ముందునుండీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతుండగా, ఇపుడు రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచేలా పీవీ కుమార్తెను హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి ఎంపికచేసి షాకిచ్చింది. ఈ ఎంపిక ద్వారా రెండు స్థానాలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నమో.. టీఆర్‌ఎస్‌ చాటిచెప్పింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ స్థానానికి సంబంధించి నామినేషన్‌, ప్రచారానికి సంబంధించి మంత్రులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. గెలిపించి తీసుకురావాలని మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, మహబూద్‌ అలీ, నిరంజన్‌ రెడ్డి, సబిత, మల్లారెడ్డి తదితరులకు సీఎం సూచించారు.
విద్యావేత్తగా సేవలు…
వాణీదేవి ప్రముఖ విద్యావేత్తగా సేవలందిస్తున్నారు. మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల వ్యవస్థాకులుగా వ్యవహరిస్తున్నారు. గజ్వేల్‌లోని సురభి దయాకర్‌రావు ఫార్మసీ కాలేజీ, కరీంనగర్‌ జిల్లా ముల్కనూరులో స్వామి రామానంద తీర్థ జూనియర్‌ కళాశాల, బేగంపేట్‌లోని స్వామి రామానందతీర్థ మెమోరియల్‌ స్కూల్‌, స్వామి రామానందతీర్థ మెమోరియల్‌ కమిటీలకు ఇన్‌చార్జీ చైర్‌పర్సన్‌గా, ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు శ్రీవెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా, 1997 నుంచి 2008 వరకు లెక్చరర్‌గా సేవలందించారు. 1990 నుంచి 1995 మధ్యకాలంలో జేఎన్‌టీయూలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు.
విద్యార్హతలు….
1986లో జెఎన్‌టీయూ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా
1973లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా
1970లో పీయూసీ రాజాబహదూర్‌ వెంకట్రామిరెడ్డి కాలేజీ
1968లో హైదర్‌గూడ పాఠశాల నుంచి హెచ్‌ఎస్‌సీ
అద్భుత చిత్రకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ఆమె పలు చిత్రాలను గీశారు.
1973 నుంచి పలు ఎగ్జిబిషన్లలో ఆమె చిత్రాలను ప్రదర్శించారు.

బి ఫామ్ అంద‌జేసిన కెసిఆర్…

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవి, హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంత‌రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణిదేవికి కేసీఆర్ బీ ఫార్మ్ అంద‌జేశారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం వాణిదేవి.. గ‌న్‌పార్క్‌కు వెళ్లారు. అక్క‌డ అమ‌ర‌వీరుల స్థూపానికి వాణిదేవి నివాళుల‌ర్పించారు. అనంత‌రం త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి బ‌య‌ల్దేరారు. సీఎంతో స‌మావేశం కంటే ముందు.. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద వాణిదేవి పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement