Saturday, April 27, 2024

Telangana: మాక్కూడా కొత్త‌ మండలం కావాలే.. తెలంగాణ‌లో పెద్ద ఎత్తున‌ నిరసనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్తగా 14 మండలాలను ప్రభుత్వం ప్రకటించడంతో మరిన్ని మండలాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరగడంతోపాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన 14 కమండలాలతో మరిన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్ల పెంపు డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు దగ్గరయ్యే క్రమంలో 2016 దసరానుంచి తెలంగాణలో 10నుంచి జిల్లాల సంఖ్య 33కి పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాజాగా ప్రజలు గుర్తుచేస్తున్నారు.

ఈ క్రమంలో మళ్లీ రోడ్లమీదకు వచ్చి మండలాల సాధన సమితిల పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కంగ్టి మండలంలోని తడ్కల్‌ను కొత్త మండలంగా ప్రకటించాలని ప్రజలు ఆందోళనలకు దిగారు. జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలంలోని మన్నెగూడెన్ని కొత్త మండలం కోరుతూ ప్రజలు తాజాగా బంద్‌కు పిలుపునిచ్చారు. గతంలో మరుగున పడిన డిమాండ్లు కూడా ఈ ప్రతిపాదనలతో మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ధర్నాలు చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో కొత్త మండలాలు కోరుతూ డిమాండ్లు పెరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని మండలంగా చేయాలంటే తమ ఊరును మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేరుతున్నాయి. కొత్త జిల్లాల కసరత్తు పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ డివిజన్లు, మండలాలకు గిరాకీ పెరుగుతోంది. పెరిగిన జనాభా, విస్తరించిన విస్తీర్ణం పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న మండలాలనుంచి కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. సాధ్యాసాధ్యాలు, అనుకూలతలు, అననుకూలతల వంటి అంశాలతోపాటుగా మరో 20 శాఖాపరమైన శాస్త్రీయ కొలమానాల ఆధారంగా ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుపై సమీక్షను తుది దశకు తెచ్చిన ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటును పూర్తి చేసింది.

ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించింది. అదేవిధంగా మరో 13 మండలాలను తాజాగా ప్రకటించడంతో కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజలు రాస్తారోకో చేయడం సంచలనం సృష్టించింది. ములుగు జిల్లాల వెంకటాపూర్‌ మండలంలోని లక్ష్మీదేవీపేటను మండలంగా చేయాలని, ములుగు మండలంలోని మల్లంపల్లి, మంగపేట మండడంలోని రాజుపేటను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలంలోని సానాలను మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి.

వనపర్తి జిల్లాలోని కొల్లూరు మండలం ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ మండల సాధన సమితులు ఉద్యమబాట పట్టాయి. దీంతో పలు జిల్లాల్లో మండలాల ఏర్పాటు ఆందోళనలను మిన్నంటుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో హామీనిచ్చిందని కొందరు సొంత పార్టీ నేతలే ఈ ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నారు. దీంతో పలు మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. జిల్లాల ఫార్మేషన్‌ యాక్టు-1974 ప్రకారం కొత్త జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు జరుగుతోంది.

- Advertisement -

2016లో ఈ చట్టం మేరకు కొత్తగా 23 జిల్లాలు, 33 కొత్త రెవెన్యూ డివిజన్లు, 136 కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. తాజాగా వస్తున్న డిమాండ్ల మేరకు మరో ఏడెనిమిది మండలాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి వచ్చిన డిమాండ్లను చూస్తే మండలాలు కావాలనే విజ్ఞప్తులు 30కిపైగా వచ్చినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement