Wednesday, May 15, 2024

Follow up: మెడికల్‌ సిటీగా వరంగల్ .. 2000 పడకలు, 24 అంతస్తులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: వైద్యరంగంలో వరంగల్‌ అద్భుతమైన మెడికల్‌ సిటీగా రూపుదిద్దుకోబోతున్నది.. తెలంగాణలోని అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని వరంగల్‌లో నిర్మాణం చేస్తున్నాం.. 2000 పడకలతో 24 అంతస్తులతో నిర్మాణం చేస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఒక మణిహారంగా ఉండబోతున్నది. ఇప్పటికే వరంగల్‌లో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యుత్తమైన వైద్యసేవలు అందనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం హనుకొండ జిల్లా దామెర సమీపంలో ప్రతిమ గ్రూప్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాల, క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మాణమవుతున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

రూ.1100 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం..

వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో 24 అంతస్తులతో చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ మంత్రులను ఆదేశించారు. గత ఏడాది జూన్‌ 20న సెం ట్రల్‌ జైలు స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. సెంట్రల్‌ జైలుకు చెందిన 60 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణ పనులు చేపడుతున్నారు. రోడ్డు భవనాల శాఖ పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పనులను చేపట్టింది. 16.50 లక్షల చదరపు అడుగుల్లో మూడు బ్లాకులుగా 1750 పడకలతో నిర్మాణం చేయనున్నారు. అత్యవసర వైద్య సేవలకోసం ఎయిర్‌ అంబులెన్స్‌, హెలికాప్టర్‌ను వినియోగించుకునేందుకు అనువుగా 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ ఉండేలా డిజైన్‌ చేశారు. గత మార్చిలో ఎల్‌అండ్‌టీ సంస్థ పనులను చేపట్టింది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ బి ఇంజనీర్లు ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులపై సీఎంకు నివేదించారు. ఆస్పత్రి భవన నిర్మాణ నమూనాను సీఎం తిలకించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వైద్యానికి చికిత్సను అందించే హెల్త్‌ హబ్‌గా వరంగల్‌ మారుతుందన్నారు. ఆధునిక వైద్యం కోసం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తర్వాత హైదరాబాద్‌ వాళ్లే వరంగల్‌కు వచ్చేలా ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి అదిలాబాల్‌ జిల్లాల నుంచి సైతం వైద్యసేవల కోసం వరంగల్‌కు వస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement