Monday, April 29, 2024

కొలువుల భర్తీ కొలిక్కి వ‌చ్చేనా.. రిజర్వేషన్లతో ఆలస్యంకానున్న నోటిఫికేషన్లు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు ఉద్యోగ నోటిఫికేషన్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య దాదాపు 52,460 వరకు ఉంది. ఇందులో దాదాపు 21500 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్లు వచ్చాయి. పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు పరీక్ష ఇంకా జరగాల్సి ఉంది. ఆర్థికశాఖ అనుమతులు పొందిన గురుకుల, గ్రూప్‌ 2, 3, ఇతర నోటిఫికేషన్లు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయండంతో ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు అమలవుతాయా? లేక? ఇకమీదట వెలువడే కొత్త నోటిఫికేషన్లకే అమలవుతాయా? అన్న సందేహాలు ఉద్యోగార్థుల్లో ఉంది. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన 80వేల పోస్టులకు అమలు చేయాల్సి వస్తే మాత్రం ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ప్రకటించినట్లుగా గిరిజనులు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మొత్తం పోస్టులపై 8వేలకు పైగా పోస్టులు గిరిజనులకు దక్కాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన దానిప్రకారం 52వేలల్లో 5246 వరకు పోస్టులు కాగా, నోటిఫికేషన్లు జారీ చేసిన 21వేల పోస్టుల్లో దాదాపు 2100 పోస్టులు గిరిజనులకు దక్కాల్సి ఉంటోంది. ఈ రిజర్వేషన్ల పెంపు కారణంగా ఇప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్లన్నీ మార్చాలా? లేకుంటే కొత్త రిజర్వేషన్లు అమలు చేసి ముందుకు వెళ్లాలా అనేది చూడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఈ నోటిఫికేషన్లకు కోర్టు కేసులు తలనొప్పులుగా మారనున్నాయి. ఆర్థి శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో కూడా ఎస్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు తీసిన తర్వాతే మరోసారి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు నుండి ఏ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న మారిన రిజర్వేషన్లకు అనుగుణంగా కొత్త రోస్ట్టర్‌ ప్రకారం జారీ చేయాల్సి ఉంటుందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్టీ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన గురుకుల, గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు, ఇంకా అనుమతులు పొందాల్సి ఉన్న గ్రూప్‌-4 నోటిఫికేషన్లు కొత్త రోస్టర్‌ ప్రకారం ఇవ్వాల్సి ఉంది.

ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులు, నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులన్నీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రతిపాదికనే ఖరారు చేసి, ఏ వర్గాలకు ఎన్ని పోస్టులో ఇప్పటికే ఖరారు చేసి ఇచ్చారు. గ్రూప్‌-1 కింద గిరిజనులకు 3 పోస్టులు దక్కాయి. ఇలా మొత్తం నోటిఫికేషన్‌ ఇచ్చిన పోస్టులన్నిటికూడా వివరంగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏ సామాజిక వర్గానికి ఎన్ని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని తేల్చిన తర్వాతే ఎవరికి ఎన్ని పోస్టులో నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం గిరిజనులకు ఆరు శాతం చొప్పున ఖరారు చేశారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన 80వేలకు పైగా పోస్టులకు ఎస్టీలకు పది శాతం పెంచితే పోస్టులు ఇంకా పెరగనున్నాయి. అదేవిదంగా నియామక ప్రక్రియ కూడా మరింత ఆలస్యం కానున్నదని ఉద్యోగార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement