Saturday, December 7, 2024

రూ.1.40 లక్షల లంచం తీసుకుంటూ.. ACBకి చిక్కిన MPDO..

వరంగల్ క్రైమ్ : అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారుల వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ ను ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేశాడు. డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని ఎంపీడీవో కుమారస్వామి తేల్చి చెప్పడంతో పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన ప్రకారం హనుమకొండలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్ లో సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఎంపీడీవో కుమారస్వామి ఇంటి వద్దకు చేరుకున్నాడు కిషోర్.

అప్పటికే పథకం ప్రకారం సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఎంపీడీవో ఇంట్లో రూ.1.40 లక్షలు నగదు లంచంగా ఇస్తుండగా పుచ్చుకున్న కుమారస్వామిని పట్టుకున్నారు. అనంతరం ఎంపీడీవో కుమార స్వామిని అదుపులోకి తీసుకున్నారు.. సోమవారం రాత్రి ఎంపీడీవో కుమార స్వామి ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం స్టేషన్ ఘణపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక ఎంపీడీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం అవినీతిపరుల్లో కలకలం సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement