Sunday, May 19, 2024

TS : రైజ్ నిర్మాణ కంపెనీ గోడ కూలి 7 గురు కార్మికుల మృతి

కుత్బుల్లాపూర్, మే 7 (ప్రభ న్యూస్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ బాచూపల్లి లో రైజ్ నిర్మాణ సంస్థ ప్రహరి గోడ కూలి 7 గురు కార్మికులు మృతి చెందగా 6 గురు కార్మికులకు గాయాలయ్యాయి. బాచూపల్లి లో రైజ్ అనే నిర్మాణ సంస్థ బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తుంది.

- Advertisement -

తన నిర్మాణానికి చుట్టూరా దాదాపు 25 ఫీట్ల ఎత్తుతో ప్రహరీ నిర్మించింది. 12 ఫీట్ల వరకు సీసీ తో ప్రహరీ నిర్మించగా ఆ పై సిమెంట్ బ్రిక్స్ తో మిగతా నిర్మాణాన్ని కొనసాగించింది. బ్రిక్స్ తో నిర్మించిన ప్రహరికి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. మరో వైపు పై అంతస్థుల నిర్మాణం కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా భారీ ప్రహరీ గోడకు అనుకుని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కంపెనీలో పనిచేసే కూలీల ఆవాసం కోసం రైజ్ సంస్థ తాత్కాలిక షెడ్లతో రూములను నిర్మించింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలి కార్మికుల కోసం నిర్మించిన తాత్కాలిక రూములపై పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు కూలీలు మృతి చెందగా 6 గురు కూలీలు గాయపడ్డారు.

తల దాచుకునేందుకు వెళ్లి….
అప్పటి వరకు కూలీలంతా పనుల్లో మునిగితేలగా వర్షం కురుస్తుండటంతో పనులకు స్వస్తి చెప్పి తాము నివసిస్తున్న షెడ్లలోకి తల దాచుకునేందుకు కూలీలంతా వెళ్లిపోయారు. చినుకు చినుకు కాస్తా భారీ వర్షంగా రూపుదల్చుకోవడం, భారీ ప్రహరికి ఇంకా
ప్లాస్టింగ్ చేయకపోవడంతో వర్షానికి అది కాస్తా కార్మికులు నివసిస్తున్న షెడ్లపై కూలింది. దీనితో అందులో ఉన్న కార్మికులు 7 గురు మృత్యువాత పడగా 6 గురు కార్మికులు గాయపడ్డారు.


సి ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు….
భారీ వర్షం కారణంగా బాచూపల్లి లోని రైజ్ నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రహరీ గోడ కూలీల కోసం నిర్మించిన షెడ్ల పై కూలడంతో ప్రమాదవశాత్తు కార్మికులు మట్టికుప్పల కింద చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న బాచూపల్లి సి ఐ ఉపేందర్ తక్షణ మరమ్మత్తు చర్యలు చేపట్టారు. జీ హెచ్ఎంసి, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిల సహాయంతో హిటాచి, జేసిబిల సాయంతో 7 గురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. 6 గురు కార్మికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన కార్మికులు వీరే….

రైజ్ నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం 7 గురు కార్మికులు మృతి చెందగా 6 గురు గాయపడ్డారు. మృతి చెందిన కార్మికులంతా పొట్టకూటికోసం ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి వచ్చినవారే.. మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉండటం కలచివేసింది. 1) తిరుపతి మజీ వయస్సు 20 ఒడిస్సా 2) శంకర్ వయస్సు 22 ఒడిస్సా 3) రాజు వయస్సు 25 ఒడిస్సా 4) ఖుషి భర్త రాజు ఒడిస్సా 5) రామ్ యాదవ్ వయస్సు 34 ఛత్తీస్ ఘడ్ 6) గీత భర్త రామ్ యాదవ్ వయస్సు 32 ఛత్తీస్ ఘడ్ 7) హిమాన్షు వయస్సు 4 , ఛత్తీస్ ఘడ్‌కు చెందిన‌వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement