Monday, May 6, 2024

టీచర్‌ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల ధర్నా

ఆర్థిక స్తోమత లేని నిరుపేద పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ఇందులో తల్లి లేదా తండ్రి కోల్పోయిన పిల్లలకు అడ్మిషన్లు ఉంటాయి. హాస్టల్లో చేరిన విద్యార్థినిలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఆ పాఠశాల ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులకు ఉండగా వారి నిర్లక్ష్యం, విచ్చలవిడి ప్రవర్తనతో పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లకు పంపాలంటే భయంతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దాంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.

వివరాల్లోకి వెళితే…జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని నమిలిగొండ గ్రామ పరిధిలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు శనివారం రెండో రోజు ధర్నా చేస్తున్నారు. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ సబితను వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. సదరు ఉపాధ్యాయురాలు పిల్లలతో పనులు చేయించుకోవడమే కాకుండా నైట్ డ్యూటీలో అర్ధరాత్రి సమయంలో బయట వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థునిల తల్లిదండ్రులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, విద్యార్థుల ధర్నాకు స్థానిక కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. గత రెండు రోజులుగా ధర్నా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోకవడం శోచనీయమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement