Thursday, May 16, 2024

వైద్య సేవలపై నిరుపేదల్లో మరింత నమ్మకాన్ని పెంచిన ప్ర‌భుత్వం : పసునూరి దయాకర్

జనగామ : తెలంగాణ ప్రభుత్వం రాకతోనే వైద్యం పై దృష్టి పెట్టామని, నిరుపేదలకు మరింత అందుబాటులోకి తెచ్చామని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ కమిటీ) చైర్మన్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని దిశ కమిటీ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 18 అంశాలపై సమీక్షించారు. విద్య, వైద్యంకు ప్రాధాన్యతనిచ్చారు. రహదారులు, మహిళా శిశు సంక్షేమం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆసరా పెన్షన్ లు, హరితహారం, జాతీయ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, పల్లె, పట్టణ ప్రగతి సెగ్రిగేషన్, వైకుంఠ దామాలు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దిశ కమిటీ చైర్మన్ పసునూరి దయాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోనే నిరుపేదలకు ప్రభుత్వ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అందించాలని హాస్పిటళ్ల‌ను సంస్కరించామన్నారు.

క‌రోనాలో సమయంలో వైద్యులు అందించిన సేవలు అమోఘమని ఎంపీ దయాకర్ కొనియాడారు. వైద్యంలో జిల్లాకు రాష్ట్రంలోనే మూడవ స్థానం లభించడం వైద్య సిబ్బంది అంకితభావానికి నిదర్శనమన్నారు. దిశ కమిటీ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందుండటం గర్వకారణమన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఐటిడిఏ పాఠశాలలో పర్యవేక్షణ పెంచుతామన్నారు. అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో గురుకులాలు ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే వస్తువులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు 100శాతం నిర్మించడం జరిగిందని, కావాల్సిన వారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లు అబ్దుల్ హమీద్, భాస్కర్ రావు, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డిఎ పిడి రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement