Friday, April 26, 2024

ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్.. ఛలో కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత..

భూపాలపల్లి : పెట్రోల్, బస్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. డీజిల్, మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలు, పెరుగు, నూనెలు, పప్పు, ఉప్పుతో పాటు గ్యాస్, డిజీల్ , పెట్రోల్ తో పాటు ఇతర నిత్యావసర సరుకులపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీ విధించి, పేద ప్రజల పొట్ట కొడుతున్న కొడుతున్నారని విమర్శించారు. తక్షణమే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలను నియంత్రించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట
నిత్యవసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి, కాంగ్రెస్ నాయకులు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, లీడర్లకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, గండ్ర సత్యనారాయణ రావు లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా వారి వాహనాలకు అడ్డుతగిలి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పలువురు కాంగ్రెస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మండల పార్టీ ప్రెసిడెంట్లు,జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement