Friday, December 6, 2024

TS: కాంగ్రెస్ కు ఓటెయ్యండి.. ఐదు గ్యారంటీలు పొందండి.. మంత్రి శ్రీధర్ బాబు

… రైతు వ్యతిరేకి బీజేపీ
.. రాహుల్ ప్రధాని కాగానే కులగణన
.. పరుగు లేకుండా ధాన్యం కొనుగోలు
పెద్దపల్లి రూరల్ (ఆంధ్ర ప్రభ) : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారెంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రైతు న్యాయం పేరిట మొదటి గ్యారెంటీ అమలు చేస్తామని, యువ న్యాయ్ పేరిట యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడమే కాకుండా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ప్రతి నెలా 8,500 చొప్పున ఏడాది పాటు అందిస్తామన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులతో పాటు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు.

బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, పదేళ్లలో కనీస మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు. ఢిల్లీలో దీక్ష చేపట్టిన ఎందరో రైతుల ప్రాణాలు బీజేపీ బలి తీసుకుందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం కట్టబెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంపు, 200యూనిట్ల ఉచిత కరెంట్ ప్రారంభించామన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని, లేకపోతే అప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమను ప్రశ్నించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలోని టేలండ్ ప్రాంతా రైతులకు సాగునీరు అందించేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్నారని దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ను ఐదేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్, ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మణ్ కుమార్, వివేక్, పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ తోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement