Wednesday, May 8, 2024

మహనీయులందరినీ యాది చేసుకుంటున్నాం.. దేశంలో ఈ సంస్కృతి మ‌రెక్క‌డా లేద‌న్న ఎర్ర‌బెల్లి

వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్ని బుధ‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాల్మీకి చిత్ర‌ప‌టానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలన్నిటినీ ప్రభుత్వం గుర్తించి గొప్పగా నిర్వ‌హిస్తోంది. గొప్ప కవులు, కళాకారులు, చారిత్రక పురుషుల జయంతి, వర్ధంతిని కూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వ‌హిస్తోంది. ఒక్క తెలంగాణలో తప్ప ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదు. ఇదే వరుసలో వాల్మీకి జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తోంది. ఒక అతి సామాన్యుడు.. బోయవాడు అంత గొప్ప కవి కావడం మన దేశ సంస్కృతి గొప్పతనం. జంట పక్షులలో ఒక పక్షిని నేల కూల్చిన వాల్మీకికి ఆ పక్షి శోకంలోంచే జ్ఞానోదయమై శ్లోకం పుట్టిందట. అప్పటి నుండి వేట మానేసిన వాల్మీకి సాదువుగా దేశమంతా తిరుగుతూ రామాయణాన్ని రాశాడన్నది చరిత్ర. అలా పాలకుర్తి నియోజకవర్గంలోని వాల్మీకిపురం కాలక్రమేణా వల్మీడిగా మారిన గుట్టల్లో కొంత కాలం తపస్సు చేశారని చెబుతారు. మహర్షి అడుగిడిన ప్రాంతానికి నేను ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నా. వాల్మీకి నడియాడిన వల్మిడి గుట్టను తెలంగాణ ప్రభుత్వం 10 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అంత గొప్ప మహానుభావుడిని ఈ రోజు స్మరించుకోవడం మన అదృష్టం. వాల్మీకి రాసిన రామాయాణానికి మనిషి బతికి ఉన్నంత వరకు ఉనికి ఉంటూనే ఉంటుంది. మరోసారి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటిస్తూన్నా‘ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డా.బి.గోపి, జిల్లా అధికారులు, బోయ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement