Sunday, May 19, 2024

Atchampet – బిఆర్ఎస్ కు 12 ఎంపి సీట్లు ఇస్తే రేవంత్ ఇంటికెళ్ల‌డం ఖాయం – కెటిఆర్

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం
— ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించేది కేసీఆరే
— పత్తాలేని కాంగ్రెస్ హామీలు
— మత విద్వేషం తప్ప అభివృద్ధి లేని బిజెపి పాలన
— పార్టీకి వెన్నుపోటు పొడిచి బిజెపిలో చేరిన ఎంపీ రాములు
— బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


అచ్చంపేట మే 8 ప్రభ న్యూస్ – క‌ల్వ‌కుర్తి – ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 12 సీట్లు ఇస్తే గుంపు మేస్త్రీ ఇంటికి వెళతారని అన్నారు. అత్యధిక సీట్లు మనం గెలిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. కల్వకుర్తి , అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే తన సోదరి కవిత జైల్లో ఉంటుందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనుషుల మనసుల్లో విషం నింపి ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు… నేతలకే ఉందన్నారు. మైనార్టీల కోసం కేసీఆర్ ఎంతో చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు.


మైనార్టీల కోసం కేసీఆర్ స్కూల్స్ ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని… కానీ హామీలు అమలు కాలేదన్నారు.

పదేళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోదీ మోసం చేశారన్నారు. కృష్ణా జలాల్లో పదేళ్లుగా తెలంగాణ వాటాను కూడా మోదీ తేల్చలేదని విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. ఏం అడిగినా బీజేపీ నేతలు అయోధ్యలో గుడి కట్టామని చెబుతుంటారని… కానీ కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించలేదా? దానిని ఎప్పుడైనా రాజకీయాలకు వాడుకున్నామా? అని నిలదీశారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జ‌లాల్లో వాటా తేల్చ‌లేదు మోదీ. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇవ్వ‌లేదు. అయినా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు. రాముడికి గుడి క‌ట్టామ‌ని ఓట్లు వేయ‌మ‌ని అడుగుతున్నారు. కేసీఆర్ యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి క‌ట్ట‌లేదా..? మ‌నం యాదాద్రిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌లేదు. కేసీఆర్ కాళేశ్వ‌రం, పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ క‌ట్టారు. చెరువుల‌ను బాగు చేశారు. ప్రాజెక్టుల‌కు దేవుళ్ల పేర్లే పెట్టారు. ఒక్క గుడి క‌ట్టినందుకు మోడీకి ఓటు వేయాలంటున్నారు. మ‌రి యాదాద్రితో పాటు ఎన్నో ప్రాజెక్టులు క‌ట్టి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టిన కేసీఆర్‌కు ఎన్నిసార్లు ఓటేయాలో ఆలోచించుకోండి.

మ‌న రాజ్యాంగాన్ని ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తాం అని బీజేపోళ్లు అంటున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈసారి మోదీ గెలిస్తే 400 సీట్లు వ‌చ్చుడేమో కానీ.. పెట్రోల్, డిజీల్ ధ‌ర‌లు రూ. 400కు పెర‌గ‌డం ఖాయం. మ‌ళ్లా ఒక్క‌సారి పొర‌పాటున బీజేపీకి ఓటేస్తే సిలిండ‌ర్ ధ‌ర 5 వేలు అవుతుది. ఆ త‌ర్వాత‌ మీ ఇష్టం. రూ. 400 ఉన్న సిలిండ‌ర్‌ను రూ. 1200 చేసిండు. లీట‌ర్ పెట్ర‌ల్ రూ. 60 ఉంటే.. దాన్ని రూ. 105కు పెంచిండు. ఇప్పుడు గ‌నుక బీజేపీని గెలిపిస్తే ఈ ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం ఖాయం. పేద ప్ర‌జ‌ల‌ను మోదీ న‌మ్మించి మోసం చేశార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడనుకున్నామని… కానీ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. మోచేతికి బెల్లం కట్టి ఓట్లు వేయించుకున్నాక ప్రజల్ని పట్టించుకోవడం లేదన్నారు. పేగులు మెడలో వేసుకుంటానంటూ ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్.. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. క‌ల్వ‌కుర్తిలో రియ‌ల్ ఎస్టేట్ ఎందుకు పెరగలేదు? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వాన్ని నడపడం అంటే పాన్ డ‌బ్బా న‌డిపినంతా సులభం కాదన్నారు. నోటికొచ్చిన‌ట్టు, ఇష్ట‌మొచ్చిన‌ట్టు బూతులు మాట్లాడం కాదు… ప‌రిపాల‌న అంటే ద‌మ్ముండాలి… ద‌క్ష‌త ఉండాలన్నారు. అది ఉన్న నాయ‌కుడు కేసీఆర్ కాబ‌ట్టే రియ‌ల్ ఎస్టేట్ పెరిగిందన్నారు. భూముల ధ‌ర‌లు పెరిగాయి… ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి…. నీళ్లు వ‌చ్చాయన్నారు.

ఐపీఎస్ ఆఫీస‌ర్.. విజ్ఞాన‌వంతుడు.. ఒక అధికారిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్య‌క్తి. 1000 గురుకులాల‌ను కేసీఆర్ ప్రారంభిస్తే.. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిన మొన‌గాడు ఆర్ఎస్పీ. ఇలాంటి అభ్య‌ర్థి నాగ‌ర్‌క‌ర్నూల్‌కు మ‌ళ్లీ దొర‌క‌డు. ఆయ‌న పార్ల‌మెంట్‌లో అడుగు పెడితే మ‌న గౌర‌వం పెరుగుతుంది. రాజ‌కీయ నాయ‌కులు బొచ్చెడు మంది ఉంటారు. పైస‌లు ఉన్నోళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తుంటారు. ఒక పేద కుటుంబం నుంచి క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని ఐపీఎస్ అయిన వ్య‌క్తి ఆర్ఎస్పీ. ఐపీఎస్ ఆఫ‌సీర్‌గా ఏడేనిమిదేండ్ల‌ స‌ర్వీసు ఉన్నాకూడా అది వ‌దిలిపెట్టి ప్ర‌జా సేవం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయినా మ‌న కోసం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నో బంప‌రాఫ‌ర్‌లు ఆర్ఎస్పీకి ఇచ్చింది.. ఎంపీ చేస్తాం, టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ చేస్తాం. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిని చేస్తామ‌ని ఆశ చూపెట్టిన అవేవి ప‌ట్టించుకోకుండా మ‌నం కోసం బీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు అని కేటీఆర్ తెలిపారు.

గ‌తంలో క‌ల్వ‌కుర్తిలో ఏమైనా పొర‌పాట్లు జ‌రిగితే మ‌న‌సులో నుంచి తీసేయండి. ఇవాళ అద్భుత‌మైన అభ్య‌ర్థి వ‌చ్చిండు. క‌లిసొచ్చే కాల‌కానికి న‌డిచొచ్చే కొడుకు వ‌చ్చిండ‌న్న‌ట్టు ఆర్ఎస్పీని గెలిపించండి. పొర‌పాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. రేవంత్ రెడ్డి ఒక‌టే అంట‌డు. రుణ‌మాఫీ చేయ‌కున్నా, రూ. 2,500 ఇవ్వ‌కున్నా, రూ. 4 వేల పెన్ష‌న్ ఇవ్వ‌కున్నా, స్కూటీలు ఇవ్వ‌కున్నా నాకే ఓటేశారు.. ఇంకా వాళ్ల‌కు ఏ ప‌థ‌కం అమ‌లు చేయ‌కున్న స‌రిపోత‌ది అని రేవంత్ అన్ని బంద్ పెడుతారు. కాబ‌ట్టి ఆలోచించి ఆర్ఎస్పీని గెలిపించండి అని కేటీఆర్ విజ్ఞ‌ఫ్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement