Friday, April 26, 2024

Telangana: మర్డర్​ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు.. బైక్‌, కర్రలు స్వాధీనం

జూలపల్లి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జూలపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో ఒడ్డెర కులానికి చెందిన గండికోట రాజమౌళి, వెంకటస్వామిలు ఇదే గ్రామంలో ఉంటున్న తమ అక్క కొడుకు పల్లెపు ప్రశాంత్‌ను ఈనెల 23న కర్రలతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడని వివరించారు.

ప్రశాంత్‌ తల్లిదండ్రులు వెల్గటూర్‌లో ఉంటుండగా, మేనమామలైన రాజమౌళి, మల్లేశంలు కాచాపూర్‌లోనే ఉంటున్నారన్నారు. మేనమామ మల్లేశం కూతురు పూజితను ప్రశాంత్‌ ప్రేమించగా, తల్లిదండ్రులు తిరస్కరిచడంతో ప్రేమ వివాహం చేసుకున్నారన్నారు. ఆ తర్వాత ప్రశాంత్‌ కొద్ది రోజులు దుబాయ్‌కి వెళ్లగా, వెనమామలు అతని తల్లిదండ్రులపై బంధువులతో కలిసి దాడి కూడా చేశాడన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్‌ ఏడాది తర్వాత తిరిగి కాచాపూర్‌కు వచ్చాడన్నారు.

తన తల్లిదండ్రులపై దాడి చేయడంతో ఆగ్రహంతో పూజితను వదులుకునేందుకు సిద్ధపడగా, ఆమె పెద్దనాన్న వెంకటస్వామి బలవంతంగా మరోసారి ప్రశాంత్‌కు పూజితతో పెళ్లి చెశాడన్నారు. అప్పటి నుంచి ప్రశాంత్‌, రాజమౌళిల మధ్య గొడవలు జరుగుతుండడం, పూజితతో కూడా ప్రశాంత్‌కు గొడవలు జరుగుతూ ప్రశాంత్‌పై కేసులు కూడా పెట్టారన్నారు. ఎక్కడ కనిపించినా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పథకం ప్రకారం ప్రశాంత్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారన్నారు. ఈనెల 23న నిందితుడు రాజమౌళి తన కొడుకు వెంకటస్వామిని కాచాపూర్‌కు రప్పించి అనుకున్న ప్రకారం కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తల, ముఖంపై బలమైన గాయాలైనట్లు వివరించారు.

గాయాలతో కరీంనగర్‌లో చికిత్స పొందుతూ ప్రశాంత్‌ మృతిచెందగా, తన కొడుకు చావుకు కారణమైన రాజమౌళి, వెంకటస్వామి, మల్లేశం, రజిత, శాంతమ్మలపై ప్రశాంత్‌ తల్లి కనకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుంచి బైక్‌తోపాటు హత్యకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జూలపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement