Thursday, May 2, 2024

TS – సీఎం రంగు, కాంగ్రెస్ పార్టీ పొంగు ప్రజలకు అర్థం అయింది – కెటిఆర్

సిరిసిల్ల, మార్చి 4 (ప్రభ న్యూస్) : సీఎం రంగు, కాంగ్రెస్ పార్టీ పొంగు ప్రజలకు అర్థం అయిందని, మార్పు పేరుతో ఓట్లు వేసిన ప్రజలకు తేలు కుట్టిన దొంగల్లా మార్పు ఏమిటో తెలిసిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం సాయంత్రం తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులు సమాయాత్తం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

ప్రధానంగా గురువారం సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు అంశాలపై డిమాండ్ చేశారు. నేత కార్మికులకు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇవ్వాలని, కార్మికులను ఆసాములుగా చేయడం కోసం రూ.400 కోట్లతో నిర్మించిన వర్కర్ టు ఓనర్ షెడ్లను కార్మికులకు అందజేసి పథకం అమలు చేయాలని, పూర్తిచేసిన మల్కపేట రిజర్వాయర్ ను వెంటనే ప్రారంభించాలని, జలాశయంను నీటితో నింపి రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు.

అలాగే నేతన్నలపై అనుచితంగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ తో దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని, ఆర్డర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలని, తనపై కోపం ఉంటే నేతన్నలపై పగ తీర్చుకోవద్దన్నారు.

ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకుంటే పదేళ్లలో తెలంగాణ మోడల్ భారతదేశం ఆచరిస్తున్నదని, తెలంగాణ మోడల్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, ప్రధాని మోడీ తమ పథకాలను కాపీ కొట్టారని ఈ స్థితిలో మోడీని బుట్టలో వేసుకోవడానికి, మచ్చిక చేసుకోవడానికి ప్రాపకం పెంచుకోవడానికి మస్కా కొడుతూ బడే బాయి గా రేవంత్ అభివర్ణించారన్నారు.

ఆత్మాభిమానం గల ఏ తెలంగాణ బిడ్డ అయినా దీనిని హర్షించరని, గుజరాత్ మోడల్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ అంటే మతాలు మార్చడం, దాడులు చేయడం అన్న రేవంత్ రెడ్డి మూడు నెలలకే మాట మార్చడం, ఆయన ముఖ్యమంత్రి కావడం మన కర్మ అని, ఈ మాటలు వింటేనే సిగ్గు అనిపిస్తున్నదిని అన్నారు.

- Advertisement -

నిన్నటితో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు అర్థం అయిందని, మహారాష్ట్రలో, అస్సాంలో జరిగిన ఉదంతాలే తెలంగాణలో రాబోతున్నాయని స్పష్టమైనదని అన్నారు. రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ సిండే, మరో హేమంత్ బిశ్వాస్ కాబోతున్నారని, మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు పెట్టుకుని ప్రధాని మోడీని మీ ఆశీర్వాదం కావాలని అన్నాడంటే మళ్లీ మోడీ ప్రధాని అవుతున్నాడని చెప్పకనే చెప్పాడన్నారు.

రాహుల్ గాంధీ దీనితో పరోక్షంగా వేస్ట్ ఫెల్లో అని అర్థం చెప్పాడన్నారు. రాష్ట్రంలో దివాలా కోరు రాజకీయాలు నెరుపుతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాలేశ్వరం అని, దీనిలో ఒక్క పిల్లర్ కృంగిపోతే ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేస్తున్నారని, అదే కేసీఆర్ అధికారంలో ఉంటే కృంగిన చోట కాపర్ డ్యాం నిర్మించి మరమ్మత్తులు చేయించి సముద్రంలోకి నీరు వృధా పోకుండా చేసేవాడన్నారు.

నీరు కిందికి విడువడంతో రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నదని, మరోవైపు పంటలు ఎండిపోతున్నాయని, ప్రజలు తమతో గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నాడు. ప్రభుత్వానికి ఎలా చేయాలో తెలియదని, రేవంత్ రెడ్డికి ఆ తెలివి లేదని తమపై ఉన్న కోపం రైతులపై, నేతన్నలపై తీర్చుకుంటున్నాడని ఆరోపించారు.

ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను కేసీఆర్ సిరిశాలగా, జిల్లాగా మార్చాడన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకుంటూ తాము పూర్తి చేసిన పనులకు రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటనలు చేస్తున్నాడని, తాము సిద్ధం చేసిన 15,750 పోలీసు ఉద్యోగాలను ఇచ్చామని చెప్పుకుంటున్నాడని, పెళ్లి కాకుండానే బిడ్డలు పుట్టినట్టుగా ఉద్యోగాల కాగితాలు ఇస్తున్నాడని కేటీఆర్ ఆరోపించాడు.

నేతన్నలకు ఇవ్వాల్సిన రూ. 200 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను సిరిసిల్లకు సీఎం వచ్చేలోగా రేపే విడుదల చేయాలని ఈ ప్రాంత శాసనసభ్యులుగా తాను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. వర్కర్ టు ఓనర్ షెడ్లను నేతన్నలకు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వాటిని రాబట్టుకోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో ఈ మండలం నుండి 50 వేల మెజార్టీని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు.

మొన్నటి వరకు ఎల్ ఆర్ ఎస్ ను వ్యతిరేకించిన ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఇప్పుడు ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనుమతినివ్వాలన్నారు. 25 లక్షల 44 వేల కుటుంబాలకు చెందిన ఎల్ఆర్ఎస్ లో 25 వేల కోట్ల వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారని, దిగువ ప్రజలకు నష్టం చేసే చర్య అని కేటీఆర్ అన్నారు అలాగే ఎల్ఆర్ఎస్ పై బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని, ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వాలని కోరారు. ప్రజల పక్షాన పోరాడాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

సిరిసిల్లా – డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవెస్తా అని మాట ఇచ్చిన రేవంత్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పారని మండిప‌డ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, చేనేతలను ఆదుకున్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్ చేస్తోందని ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని తెలిపారు. చేనేతలకు పని కల్పించాలని తాను మంత్రి తుమ్మలను కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నుంచి మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర‌కూ ప‌నులు చేయ‌కుండా ప‌బ్బం గ‌డిపేస్తున్నారంటూ ఆరోపించారు.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

ఐదోసారి త‌న‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, మనకు అధికారం పోయిందని ఎవరు దిగులు పడొద‌ని, .. 100 స్పీడ్తో 10 సంవత్సరాలు ప్రయాణం చేశాం అని పేర్కొన్నారు. ఇప్పుడు కాస్త విరామం కొరకు కార్ గ్యారేజ్ కు పోయింద‌ని, మళ్ళీ సత్తా చాటుదాం అని చెప్పుకొచ్చారు. మనకు మంచే జరిగిందని, దిష్టి పోయి.. కేసీఆర్ విలువ ఎందో ప్రజలందరికీ తెలిసింది అని కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వరం దండగా అన్న కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగి పోతే రిపేర్ చేయకుండా కేసీఆర్ను బద్నాం చేయడానీకి ప్రయత్నం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్న నర్మాల ప్రాజెక్ట్ నీళ్లు నింపినారా.. నీళ్లు నింపిన ఘనత కేసీఆర్ దే అని చెప్పుకొచ్చారు. మనం ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంద‌న్నారు.

అధికారప‌నుల ఒత్తిడిలో స్థానిక నేత‌లకు, కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌లకు సమయం ఇవ్వలేక పోయాన‌ని ఒప్పుకున్నారు. ఇప్పటి నుంచి మీ కష్ట, సుఖాల్లో నేను ఉంటాన‌న్నారు.. . పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించుకుందాం అని ఆయన చెప్పుకొచ్చారు. మన పార్టీ నుంచి వెళ్ళే వారిని ఎవరు అపోద్ద‌ని, కొత్త నాయకత్వాన్ని ఏర్పర్చుకుందామ‌ని అన్నారు. గత ఐదేళ్ల కింద పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను ఓడగొట్టుకొని తప్పు చేసుకున్నామ‌ని, మరోసారి అలాంటి తప్పు చేయద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇక, బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేయలేద‌ని,.. కేవలం మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్ కు ఈ ఆయ‌న ఏం చేశార‌ని కేటీఆర్ నిల‌దీశారు. తెలంగాణలో బీజేపీ అయోధ్య రామమందిర పేరు మీద రాజకీయం చేస్తూ ఓట్లు దండుకొనెందుకు ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.

బండికి స‌వాల్
తెలంగాణ‌కు భారీగా నిధులు కేంద్రం నుంచి తెచ్చాన‌ని అంటున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వాటితో ఎటువంటి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని సవాల్ సవాల్ విసిరారు. కరీంనగర్ పార్లమెంటు ఏం అభివృద్ధి చేశావు.. వినోద్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా.. చెప్పు ముస్తాబాద్ వస్తావా.. కరీంనగర్ వస్తావా..? అంటూ సవాల్ విసిరారు. ఇక, ఎల్లుండి జిల్లా పోలీసు కార్యాలయం ఆఫీస్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వస్తున్నారు అవి కట్టింది మనమే కదా అని గుర్తు చేశారు. 12 తేదీన పార్లమెంట్ ఎన్నికల “కథన భేరి” కరీంనగర్ నుంచి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. మీరంతా నా కుటుంబ సభ్యులు.. ఎక్కడ పోగుట్టుకున్నమో అక్కడే గెలుచుకుందామ‌న్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్అర్ఎస్ పై ధర్నాకు పిలుపు ఇచ్చామ‌ని,అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement