Monday, May 6, 2024

టీచర్లకు పదోన్నతులు క‌ల్పించాలి.. జాక్టో ఆధ్వ‌ర్యంలో డీఎస్ ఈ ముట్ట‌డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్లకు పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పేర్కొంది. బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్‌ విడుదలతో పాటు, విద్యారంగంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాక్టో ఆధ్వర్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎస్‌ఈ) కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ఇందులో దాదాపు 19 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నట్లు ఎస్‌టీయుటీఎస్‌ అధ్యక్షులు జి.సదానందం గౌడ్‌ తెలిపారు. బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్ల పోస్టులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా 10,479 పీఈటీ, పండిట్‌ పోస్టులను అప్‌గ్రేడ్‌ ప్రక్రియను పూర్తి చేసి, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.

317 జీవో అమలు సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. టీఆర్టీ రిక్రూట్‌మెంట్‌ అయ్యేలోగా విద్యార్థులకు నష్టం జరగకుండా విద్యావాలంటీర్లను నియమిచాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో క్లీనింగ్‌ చేయడానికి సర్వీస్‌ పర్సన్లను నియమించడంతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను పంపిణీ చేయాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో జాక్టో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. డీఎస్‌ఈ ముట్టడి కార్యక్రమంలో ఎస్‌టీయుటీఎస్‌ ప్రధాన కార్యదర్శి పర్వత్‌రెడ్డి, టీపీటీయు అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి పి.చంద్రశేఖర్‌, టీఎస్‌టీటీఎఫ్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌ నాయక్‌, బీసీటీఏ అధ్యక్షులు కె.కృష్ణుడు, మరికొన్ని సంఘాల నేతలు, టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement