Tuesday, May 7, 2024

మోడీ కోసమే కేసీఆర్ వ్యూహాలు.. బీజేపీకి లాభం చేసే కుట్ర : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అనుకూలంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ-టీఆర్ఎస్ లోపాయకారి వ్యవహారాలు, పార్టీలో చేరికలు, రాహుల్ గాంధీ పర్యటన, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాల గురించి చర్చించినట్టు నేతలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నారని, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటున్నారని.. ఇవన్నీ కూడా బీజేపీకి ఉపయోగపడడం కోసమేనని సూత్రీకరించారు. మోడీ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే కేసీఆర్ ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల అంశంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి హాజరుకాకుండా కాని విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆనాటికి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టే విపక్ష కూటమితో జట్టుకట్టలేదని తెలిపారు.

ఎప్పుడైతే బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ప్రకటించారో అప్పుడు అధికార కూటమి గెలుస్తుందన్న నమ్మకం వచ్చాక విపక్షాల ఉమ్మడి అభ్యర్థి నామినేషన్‌కి టీఆర్ఎస్ నేతలు హాజరై మద్ధతు ప్రకటించారని గుర్తుచేశారు. దీన్ని బట్టే టీఆర్ఎస్ వ్యూహాలు, మోడీ అనుకూల విధానాలు తెలిసిపోతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీకి అనుకూలంగా ఉపయోగపడుతుందని భావిస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారని రేవంత్ అన్నారు. బెంగాల్‌లో ప్రశాంత్ కిశోర్ ఎలాగైతే అటు దీదీ (మమత బెనర్జీ), ఇటు మోదీకి ఉపయోగపడేలా వ్యూహాలు అందించారో తెలంగాణలోనూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఉపయోగపడే వ్యూహాలు అమలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సూత్రీకరించారు.

పార్టీలో చేరికలు భారీగా జరగనున్నాయని, అయితే ఆ వివరాలను బయటికొస్తే అధికారంలో ఉన్న పార్టీలు తమ నేతలపై ఒత్తిడి చేసి పార్టీ వీడకుండా అడ్డుకుంటాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే చేరికల విషయంలో గోప్యతను పాటిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున జరగబోయే చేరికల గురించి అధిష్టానంతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. టికెట్ల విషయంలోనూ చర్చ జరిగిందని, ఎన్నికల సమయంలో అనుసరించే ప్రక్రియ ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థి విజయావకాశాలు మాత్రమే కాకుండా పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, విశ్వసనీయతను కూడా టికెట్ల కేటాయింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.

కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలే.. భేదాభిప్రాయాలు లేవు: భట్టి
పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలే తప్ప భేదాభిప్రాయాలు లేవని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్గత వ్యవహారాలతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాలపై కూడా అధిష్టానం పెద్దలతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయని, ఇదంతా దశలవారీగా జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో అయితే టీఆరెఎస్ లేదంటే బీజేపీ అన్న చందంగా లోపాయికారి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

- Advertisement -

అందుకే హైదరాబాద్‌లో జరిగిన సభల్లో కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మోడీ ప్రస్తావించలేదని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోడీని కేసీఆర్ ఎక్కడా తప్పుబట్టలేదని సూత్రీకరించారు. ఈ ఇద్దరి నాటకాలను ప్రజలకు వివరించే కార్యాచరణతో ముందుకుపోతామని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement