Friday, May 17, 2024

విద్యార్థులకు త‌గ్గ‌ట్టు టీచ‌ర్లు లేరు.. ఉన్నవాళ్ల‌తోనే తెలుగు, ఇంగ్లిష్‌ క్లాసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రైవేట్‌ బడుల్లో చదువులు చాలా ఖరీదైపోవడంతో స్థోమత లేని పేదలు, మధ్యతరగతి వారు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల జోరు పెరిగింది. తరగతి గదుల్లో విద్యార్థులు ఫుల్‌గానే ఉన్నా… విద్యార్థుల సంఖ్య, సెక్షన్లకు అనుగుణంగా టీచర్ల కొరత వెంటాడుతోంది. చాలా బడుల్లో టీచర్ల సంఖ్య డల్‌గా ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తునాయి. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లూ నడుస్తున్నా ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లకు ప్రత్యేకంగా టీచర్లను కేటాయించని పరిస్థితి నెలకొంది. ఉన్న టీచర్లతోనే తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం క్లాసులు చెప్పిస్తున్నారు. ప్రభుత్వ బడులు రాష్ట్ర వ్యాప్తంగా 26,068 ఉంటే అందులో 1,03,911 మంది టీచర్లు పనిచేస్తున్నారు. సుమారు ఇంకా 15 వేల నుంచి 20వేల మంది టీచర్ల అవసరముంది.

ఇంగ్లీష్‌ మీడియానికి మంచి స్పందన…

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడిబాట పడుతున్నారు. ఈక్రమంలోనే ఈ విద్యా సంవత్సరంలో జూన్‌ 13 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.75లక్షల అడ్మిషన్ల వరకు నమోదయ్యాయి. ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టడంతోనే ఈ స్థాయిలో విద్యార్థులు చేరుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియానికి ప్రజల నుంచి మంచి స్పందనే వస్తున్నప్పటికినీ ఆస్థాయిలో టీచర్ల సంఖ్య లేకపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. సర్కారు బడుల్లోనూ గతం కంటే నాణ్యమైన విద్య, మౌలిక వసతులు మెరుగవ్వడంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. దీంతో సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కో తరగతిలో సామర్థ్యానికి మించి అడ్మిషన్లు నమోదవుతున్నాయి. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 16 వేలకు చేరువగా అడ్మిషన్లు నమోదైతే, హైదరాబాద్‌లో దాదాపు 11వేల వరకు, సంగారెడ్డి జిల్లాలలో 10 వేలకు పైగా అడ్మిషన్లు ఈ విద్‌య సంవత్సరానికి నమోదయ్యాయి. ఇంకా చాలా జిల్లాల్లో 5 నుంచి 10 వేల మధ్య ఈ అడ్మిషన్లు నమోదయ్యాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతునే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది వరకు విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నారు. సర్కారు బడుల్లో టీచర్ల కొరత ఉండడంతో 2019-20 విద్యా సంవత్సరంలో 16 వేల మంది విద్యావాలంటీర్లను విధుల్లో తీసుకున్నారు. కోవిడ్‌ కారణంగా వారిని రెన్యూవల్‌ చేయకుండా ఈ విద్యా సంవత్సరం కూడా వారిని పక్కనబెట్టేశారు. విద్యాశాఖ కూడా వీరిని తీసుకునే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది. దాంతో ఉన్న టీచర్లతోనే ఒకవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లీష్‌ మీడియం తరగతులను నడిపిస్తున్నారు. కొత్త నియామకాలు చేపట్టేంత వరకైనా టీచర్ల కొరత, సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు విద్యావాలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement