Sunday, April 28, 2024

Strong Counter – ఇటు గ‌వ‌ర్న‌ర్ పై … అటు రేవంత్ పై విరుచుకుప‌డ్డ కెటిఆర్

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీచేసిన కోదండరాంను ఏరకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్‌భవన్ నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.గవర్నర్‌ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలన్నారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని చెప్పారు.

సర్పంచుల పదవీకాలం పొడిగించాలి..
సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడగించాలి.. కానీ ప్రత్యేక ఇన్‌చార్జీలను పెట్టవద్దొన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలనచేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. కరోనా సమయంలో రెండేండ్లపాటు సర్పంచుల పరిపాలన సమయం పోయిందని, కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలన్నారు.

నీచ మానవులు తమ బుద్ధి మారరు..
మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని పెద్దలు ఎప్పుడో చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రేవంత్ అహంకారం, వేకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్సే ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన 420 అమలుపర్చాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవన్నారు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేవరకు వెంటాడుతామని స్పష్టం చేశారు.

కనకపు సింహసనం… ట్విట్

- Advertisement -

గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసిన పద్యం ‘కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement