Saturday, May 4, 2024

Followup: సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట.. అనారోగ్యం రీత్యా శాశ్వ‌త‌ బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పి. వరవరరావు (82)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వయస్సు, తీవ్ర అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. భీమా-కోరేగాఁ అల్లర్ల కేసులో ‘చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం’ ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వైద్య చికిత్సకు వీలుకల్పిస్తూ ముంబై హైకోర్టు కాలవ్యవధితో కూడిన మెడికల్ బెయిల్ మంజూరు చేసింది.

వయస్సు, అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని మెడికల్ బెయిల్‌ను శాశ్వతంగా మంజూరు చేయాలన్న వరవరరావు అభ్యర్థను ముంబై హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇరుపక్షాల వాదనల అనంతరం బెయిల్ కాలపరిమితిని తొలగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో వరవరరావు వయస్సు, అనారోగ్యంతో పాటు ఇప్పటికే రెండున్నరేళ్ల పాటు జైలు జీవితాన్ని గడపడాన్ని కూడా ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. వైద్య చికిత్సకు వీలుకల్పిస్తూ ముంబై హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ షరతుల్లో 3 నెలల తర్వాత లొంగిపోవాల్సిందిగా ఉంది.

అయితే ఈ మూడు నెలల కాలంలో ఆయన ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదన్న పిటిషనర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ పరిస్థితుల్లో 3 నెలల తర్వాత లొంగిపోవాలన్న నిబంధనను సుప్రీంకోర్టు తొలగించింది. బెయిల్ పూర్తిగా ఆరోగ్య కారణాలతోనే మంజూరు చేస్తున్నామని, దీనికి కేసులోని మెరిట్స్‌తో సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇవీ షరతులు…

  1. ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ న్యాయస్థానం (ట్రయల్ కోర్ట్) అనుమతి లేకుండా వరవరరావు గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికీ వెళ్లకూడదు
  2. కేసులో సాక్షులను కలవడం, ప్రభావితం చేయడం, దర్యాప్తును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదు
  3. తాను కోరుకున్న వైద్యం, చికిత్స పొందవచ్చు. అయితే ఆ వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తెలియపర్చాలి

భీమా-కోరేగాఁ అల్లర్ల వెనుక ఉన్న మావోయిస్టులతో వరవరరావుకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను కేసులో కుట్రదారుడిగా పేర్కొంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2018 ఆగస్టు 28న వరవరరావును ఎన్ఐఏ అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్‌లో వరవరరావును ముంబైలోని తలోజా జైలుకు తరలించింది. జైల్లో ఉండగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 2020లో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 2021 ఫిబ్రవరిలో ముంబై హైకోర్టు ఆయనకు 6 నెలల పాటు మెడికల్ బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

ఈ బెయిల్‌ను ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 13న వరవరరావుకు మెడికల్ బెయిల్‌ను శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేయడం కుదరదని, మరొక్క 3 నెలలు మాత్రమే బెయిల్ పొడిగిస్తున్నామని, ఆ తర్వాత వరవరరావు లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం వరవరరావుకు మంజూరైన మెడికల్ ‌బెయిల్‌పై ఉన్న కాలపరిమితిని తొలగిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement