Thursday, May 9, 2024

Delhi: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో మందకృష్ణ పిటిషన్.. త్వరగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: షెడ్యూల్డ్ కులాలకు వర్తింపజేస్తున్న రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ దాఖలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎంఆర్పీఎస్ తరఫున సీనియన్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగ సామాజిక వర్గం దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని చెప్పారు.

ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్న ఇతర సామాజికవర్గాలు దాఖలు చేసిన పిటిషన్ 7గురు జడ్జిల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పెండింగ్‌లో ఉందని ధర్మాసనానికి గుర్తుచేశారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణకు అనుమతించాలంటూ పిటిషనర్ మంద కృష్ణ మాదిగ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రంతో పాటు కేసులోని ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం: మంద కృష్ణ మాదిగ
సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంపై పిటిషనర్ మంద కృష్ణ మాదిగ స్పందించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2004లో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ.. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిందని తెలిపారు. వర్గీకరణపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది పార్లమెంటేనని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ తర్వాత ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిందని అన్నారు. ఈ ధర్మాసనం విచారణ పూర్తికావడానికి సమయం పడుతుందని, ఈలోగా రిజర్వేషన్ ప్రయోజనాలను అందుకోలేకుండా నష్టపోతామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.

విస్తృత ధర్మాసనాన్ని వెంటనే ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణపై శాశ్వత తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని తాను సుప్రీంకోర్టును కోరినట్టు మంద కృష్ణ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసినందున, ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని మంద కృష్ణ వ్యాఖ్యానించారు.

కోర్టు తీర్పు తర్వాతే వర్గీకరణ బిల్లు: కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్
ఎస్సీ వర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన్ను మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి నేతృత్వంలో వివిధ మాదిగ సంఘాల నేతలు కేంద్ర మంత్రిని కలిశారు. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణకు వీలుకల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ రిజర్వేషన్లలో వర్గీకరణ లేకపోవడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాదిగలు, చమార్లు నష్టపోతున్నారని వెల్లడించారు.

- Advertisement -

షెడ్యూల్డ్ కులాల్లో చమార్లు, మాదిగల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ల ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువగా అందుతున్నాయని తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు, దళితుల్లోని అన్ని కులాలకు సమానంగా రిజర్వేషన్ల ఫలాలు అందేలా ప్రణాళికాబద్ధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని మాదిగ జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో బుదాల బాబురావు, ఇటుక రాజు మాదిగ, గజ్జల మల్లికార్జున్, మైస ఉపేందర్ మాదిగ, దండు వీరయ్య, బోరెల్లి సురేష్, మీసాల మహేష్, వేల్పుల భాస్కర్, హుస్సేన్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement