Sunday, May 19, 2024

TS | రాష్ట్ర ప్రతిష్ట, హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతీసిండు : కేసీఆర్

హైదరాబాద్‌ నగర బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగజారుస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని దుండిగల్‌ రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని…. తల, తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని మండిపడ్డారు.

కరెంటు కోతల కారణంగా హైదరాబాద్‌లో పరిశ్రమలు వెళ్లిపోయాయని, ఐటీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ నగరం బ్రాండ్‌ ఇమేజ్‌ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాల్పడుతున్నది. పరిశ్రమలు తరలిపోతున్నయ్‌. ఐటీరంగం కుదేలవుతున్నది. నేను ముఖ్యమంత్రి ఉండే రోజు పవర్‌ ఐలాండ్‌గా మార్చాను. న్యూయార్క్‌లో, లండన్‌లో కరెంటు పోయినా.. హైదరాబాద్‌లో కరెంటుపోకుంట చేసిన. రాష్ట్రంలో అన్ని జనరేటింగ్‌ స్టేషన్లలో నేషనల్‌ గ్రిడ్‌లో లింక్‌ చేసినం. నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరు, ఎనిమిది, పదిగంటలు కరెంటు పోతున్నది’ అన్నారు. తెలంగాణ కోసం పేలుగు తెగేదాక కొట్లాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ. రేపు పార్లమెంట్‌లో మనోళ్లు డజన్‌ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడుతరు అని అన్నారు.

మ‌రోవైపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో పది సంవత్సరాలు గడుస్తున్నది. మోదీ 150 నినాదాలు ఇచ్చిండు. నరేంద్ర మోదీ ఆ రోజు చెప్పిండు. బీజేపీని గెలిపిస్తే విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి రూ.15లక్షలు ఇస్తమన్నరు. మరి మీకు వచ్చినయా? రాలేదా? ఈటల రాజేందర్‌ చెబుతున్నడు. మరి ఏం చేయాలి ? 3లక్షల మెజారిటీతోని రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

‘బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా జరిగిందా? వికసిత్‌ భారత్‌లో ఏమైనా జరిగిందా? అమృత్‌ కాల్‌ వచ్చిందా? అచ్చేదిన్‌ వచ్చినయా? అంతా వట్టి ట్రాషే ఏమీ లేదు. మోదీ పాలనలో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశ ప్రతిష్ట మంటగలిసిపోతున్నది. మొన్న అరవింద్‌ కేజ్రీవాల్‌, కవితను అరెస్టు చేస్తే.. అమెరికా దేశం సైతం తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసుకునే మోదీ.. విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నడు. హైదరాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఐటీరంగాన్ని ఎంత అభివృద్ధి చేసినమో మీకు తెలుసు.

- Advertisement -

ఐటీఐఆర్‌ మనకు హైదరాబాద్‌కు చట్టం ప్రకారం ఉండేది. దాన్ని కూడా తీసేశాడు. ఐటీఐఆర్‌ తీసుకొనిపోయాడు. తెలంగాణకు వచ్చిన ఏడు మండలాలు.. మనకు 400మెగావాట్ల పవర్‌ ఇచ్చే సీలేరు పవర్‌ ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పగించాడు. మళ్లీ ఇప్పుడు ఏమంటున్నడు. మీ గోదావరి జలాలు, కృష్ణా జలాలు తీసుకుపోయి కర్ణాటక, తమిళనాడుకు ఇస్తామంటున్నడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? మన కృష్ణ, మన గోదావరి మనకే దక్కాలంటే లక్ష్మారెడ్డిలాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్‌లో గొంతుపట్టుకుంటరు’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement