Sunday, April 28, 2024

ఎస్సారెస్పీ 9 గేట్ల ఓపెన్‌, ప్రాజెక్టులోకి 2.66 ల‌క్ష‌ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: గోదావరి నదీపరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వ ర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తింది. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. శనివారం నుంచి నెమ్మదిగా మొదలైన ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగింది. ఆదివారం ఉదయం 4 లక్షల 92 వేల 415 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో నీటి సామర్థ్యం అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కరోజే సుమారు 30 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాజెక్టు అధికారులు ఆదివారం రాత్రి ప్రాజెక్టు 9 గేట్లను పైకి ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి దిగువకు వదులుతున్నారు. మరో 5 వేల క్యూసెక్కుల నీరు వరద కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1086.70 అడుగులుగా ఉంది. 90.313 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో ప్రస్తుతం 72.269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 1072 అడుగులతో 33.550 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. ప్రస్తుతం ఆదివారం రాత్రి సమయానికి ప్రాజెక్టులోకి 2 లక్షల 66 వేల 381 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. గోదావరి ఎగువ భాగంలోని మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ద్వారా మరో 50 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకల ద్వారా, మంజిరా, హరిద్ర నదుల ద్వారా కొంత వరదనీరు వస్తుంది. ఇంకా భారీగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే దిగువ ప్రాంత ప్రజలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరు గోదావరిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఒక్కరోజులోనే 30 టీఎంసీల నీరు చేరిక
ఆదివారం ఒక్కరోజే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 30 టీఎంసీల నీరు వచ్చి చేరింది. శనివారం రాత్రి నుంచే వరద ఉధృతి పెరుగడంతో ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు సామర్థ్యం 72 టీఎంసీలు దాటింది. ఒకదశలో ఆదివారం ఉదయం 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకు పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో అమాంతంగా ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే సోమవారం సాయంత్రం వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకోనుంది. మరిన్ని గేట్లను ఎత్తి వరదనీటిని దిగువ గోదావరిలోకి వదిలే అవకాశం ఉంది. గడిచిన నాలుగేళ్ళుగా ఎస్సారెస్పీ ప్రతి యేడాది పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఎస్సారె స్పీ ద్వారా నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. రామగుండం థర్మల్‌ విద్యుత్‌కు పూర్తిగా ఎస్సారెస్పీ నీటిని అందిస్తారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు వరద కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. ఖరీఫ్‌ పంటలకు సాగునీరు విడుదలకు ముందే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడం పట్ల ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement