Saturday, April 27, 2024

వైద్యం సేవారంగానికి చిహ్నం : గవర్నర్

యాదాద్రి : వైద్య వృత్తిలో మనస్ఫూర్తిగా సంతోషంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. శనివారం బీబీనగర్ ఆలిండియా మెడికల్ సైన్స్ కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్ వైట్ కోట్ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… వైద్య రంగంలో వినియోగించే తెల్ల కోటు సేవా రంగానికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు చిహ్నమన్నారు. మనస్ఫూర్తిగా సంతోషకరమైన వాతావరణంలో వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి అనుభవాలను, తన మాతృమూర్తి వైద్య వృత్తి పట్ల గౌరవంతో తనను తెల్ల కోటులో డాక్టర్ గా చూడాలనే కోరికను నెరవేర్చానని అంటూ, తాను వైద్య వృత్తిలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల పట్ల దృష్టి పెట్టాలని, పేషెంట్ల పట్ల అంతఃకరణ శ్రద్ద వహించి సేవలందించాలన్నారు. కొత్తగా వైద్య రంగంలోకి వస్తున్న మీరు పేషెంట్లకు అందించే చికిత్స పట్ల వారికి అవగాహన కలిగించాలని, మీరు నేర్చుకున్న విషయాల పట్ల సిన్సియర్ గా ఉండాలన్నారు.

ప్రధానమంత్రి వైద్యరంగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పట్ల శ్రద్ధతో వైద్య ఎయిమ్స్ లో వైద్య అధ్యాపకులను, వసతులను పెంచడం జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో చేపట్టిన వైద్యసేవలు ప్రపంచంలోనే పెద్దవని, జన ఔషధ్ ద్వారా తక్కువ ధరలో మందులు లభిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని, తెలంగాణకు ఎయిమ్స్ గౌరవ చిహ్నామన్నారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా నేతృత్వంలో అద్భుతమైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో వైద్యరంగంలో ఎయిమ్స్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎయిమ్స్ ద్వారా అందుతున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ వివరించారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర గవర్నర్ ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటారు.తొలుత ఎయిమ్స్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ కు గుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డి.సి.పి. నారాయణ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, డీన్ రాహుల్ నారంగ్, ప్రొఫెసర్స్ సంగీతా సంపత్, నితిన్ అశోక్, సామాజిక కర్త గూడూరు నారాయణరెడ్డి, ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement