విచ్చిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కల్లు గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాల్ వెంకట్ నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవినివ్వడం అంటే తెలంగాణా ఉద్యమానికి గౌరవం ఇచ్చినట్లని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కారులను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో తెలంగాణా ఉద్యమంలో సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణతో కలిసి తెలంగాణా జర్నలిస్ట్ లను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ అంటూ ఆయన అభినందించారు. అందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రవికుమార్ ను కార్పొరేషన్ చైర్మన్ పదవితో సత్కరించారని అన్నారు. తెలంగాణా ఉద్యమ స్పూర్తితో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్ట్ లు తెలంగాణా పునర్ నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న కుట్రలను ఛేదించడంలో మేధావులు ముందుండాలని ఆయన కోరారు.