Wednesday, May 15, 2024

తెలంగాణ పల్లెల్లో ప్రారంభమైన జాతరలు..

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండే ఊరువాడ ఒకటై మనమంతా ఒక్కటే అనే ఐక్యతా రాగంతో అంతకు మించి ఆధ్యాత్మిక చింతనతో తిరునాళ్లు జరుపుకోవడం సాంప్రదాయం. గత సంవత్సరం కరోనా ప్రభావంతో కంటికి కనిపించని తిరునాళ్ల జాతరలు ఈ యేడాది సంబురంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 186 కుపైగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న విష్ణు , శైవ , చారిత్రాత్మక గుడులల్లో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే జాతర మహోత్సవ కార్యక్రమం జనసంద్రాన్ని తలపిస్తాయి. నిజాం నవాబ్‌ కాలం నుండి అంతకు ముందు బాదామి చాళుక్యులు కాకతీయులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గుళ్లు , గోపురాలు నిర్మించుకుని కోట బురుజులు కట్టుకున్నారు. వాటి ఆనవాళ్లు చారిత్రక శిలా శాసనాలు ఇంకా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నాటి నుండి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై పల్లెల్లోని పురాతన ఆలయాలలోని దైవాలు తమ ఆరాధ్యంగా భావిస్తూ బక్తులు ప్రతియేట జాతర మహోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు పురాతన కాలం నుంచి తమ ప్రాంతంలో ఉన్న ఆలయాలను కాపాడే క్రమంలో ని ధి సేకరణ చేస్తూ ఆలయ ఆధ్యాత్మికత , పురాతన వైభవాన్ని కాపాడుతూ భవిష్యత్‌ తరాలకు అందజేస్తున్నారు. కలియుగంలో ఉరుకులు , పరుగుల జీవితాల్లో ఏడాదికి ఒక సారి పురోహితులు నిర్ణయించి తిథి , వారం , మాస , నక్షత్రాల్లో జాతర మహోత్సవాలు జరుపుకుంటారు భక్తులు. ఈ యేడాది శార్వరి నామ సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం నుండి ప్రారంభమైన జాతర మహోత్సవాలు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం వరకు కొనసాగుతాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా ఆయా ఆలయాల్లో వారం రోజుల పాటుగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు . తమ సొంత ఊరులో తిరునాళ్లు ఉన్నాయనే విషయాన్ని ముందుగా తెలుసుకుని సుదూరంగా స్థిర పడ్డ వారు సైతం మన ఊరు తిరునాళ్లు తిరిగొద్దాం పదండి అంటూ సొంత ఊర్లకు తరలి వస్తారు. నాడు పల్లెటూరి జనానికి షాపింగ్‌ మాల్స్‌ , ఆట బొమ్మలు , తినుబండారాలు కొనాలంటే అంతకు మించి ఆడపడుచులకు అవసరమయ్యే అగ్వకు దొరికే ముక్కు పుడకలు , పట్ట గొలుసులు , చేతి గాజులు , రంగురంగుల వస్తువులు ఇక్కడే కొనుగోలు చేస్తారు. కంప్యూటర్‌ యుగంలోనూ కన్న తల్లి లాంటి సొంత ఊరిలో జాతర సంబురాల్లో పాల్గొని మూలవిరాట్‌లను దర్శించుకొని తనివితీరా తన్మయం చెందుతారు గ్రామీణ ప్రాంత ప్రజలు.
జాతర మహోత్సవంలో ప్రత్యేక వేడుకలు….
జాతర మహోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతంలోని పురాతన చారిత్రాత్మక ఆలయాల్లో ఏడాదికొకసారి నిర్వహించే జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. సంబంధిత దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ గ్రామపంచాయితీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు , భక్తుల సహకారంతో ముందస్తుగా జాతర మహోత్సవ కార్యక్రమ కార్యచరణ చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ఆలయానికి సంబంధించిన ఆలయ పూజారి , భక్తులు , ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో ఆలయం వరకు ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహించి మరుసటి రోజు రథోత్సవం , తదుపరి అగ్నిగుండం , స్వామి వారి కళ్యాణోత్సవం , చివరిగా శకటోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంబురాల్లో భాగంగా వేలాది మంది భక్తులు జాతర మహోత్సవాల్లో పాల్గొని పునీతులవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement