Tuesday, July 23, 2024

Accident – ఓటు వేసి వ‌స్తుంటే…బస్సు – టిప్పర్ ఢీ ..ఆరుగురు సజీవదహనం

చిలకలూరిపేట: – పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సొంత ఊరులో ఓటు వేసి మళ్లీ హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులో కొంతమంది బయలుదేరారు. బస్సు కొంతదూరం వెళ్లగానే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. టిప్పర్ వెనుక నుంచి బస్సును బలంగా ఢీ కొట్టింది. వెంటనే చెలరేగిన మంటల్లో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మ‌రో వ్య‌క్తి చికిత్స కోసం త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించాడు. అలాగే మరో 32 మంది గాయపడ్డారు.

అసలేం జరిగింది?

మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా నుంచి అరవింద ప్రైవేటు టావెల్స్‌కి చెందిన ఓ బస్సు 42 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఎక్కువమంది చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం ప్రాంతానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలావరకు ఎన్నికల పోలింగ్‌కు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వచ్చారు. ఓటు వేసి తిరిగి బయలుదేరారు.

- Advertisement -

అర్థరాత్రి ఒంటిగంటన్నర సమయంలో చిలకలూరిపేట సమీపంలోని ఈవూరివారిపాలెం వద్ద బస్సు వచ్చేసరికి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త బస్సుకు అంటుకున్నాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే సరికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్‌తోపాటు నలుగురు ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో విషాదంగా మారింది.

వెంటనే స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌, ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. బస్సులో చిక్కుకుపోయినవారిని బయటకు తీశారు. 108 వాహనాల్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈలోగా ఫైర్ ఇంజన్లు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపట్టారు

మృతుల వివరాలు:-

  1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
  2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  5. హరి సింగ్ (39) టిప్పర్ డైవర్ ఉత్తరప్రదేశ్.
  6. దావులూరి శ్రీనివాసరావు(53) s/o సుబ్బారావు గోనసపుడి గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.

ఈ ప్రమాదం మరో 32మందికి గాయాలు కావటంతో వారిని చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.

బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం – జ‌గ‌న్
బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చంద్ర‌బాబు దిగ్ర్భాంతి..

పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement