Saturday, April 27, 2024

TS: కాంగ్రెస్ హమీలన్నీ తుస్సే… రేగా కాంతారావు

మాయమాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
100 రోజుల్లో అమలు చేస్తామన్న హమీలు బుట్టదాఖలే
కరెంటు కోతలతో ప్రజలు ఇక్కట్లు
భద్రాద్రి రామయ్య అశ్శీసులతో ఐదేళ్లు కాంగ్రెస్ పాలన జరగాలే
పశ్నించే హక్కు ఇచ్చారు…. ప్రజల పక్షాన కడిగి పారేస్తాము
భద్రాద్రి బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు


మణుగూరు, మార్చి 22 (ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ గెలిచిన 100 రోజులోనే ప్రజలకు ఇచ్చిన హమీలను నేరవేరుస్తామని చెప్పి అమలు చేయలేదని.. అన్ని తుస్సే అని భద్రాద్రి కొత్తగూడెం బీఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరు బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ… భద్రాద్రి రాముని ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు పరిపాలనలో కొనసాగాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 100 రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

ప్రజా పాలన పేరుతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల వద్ద నుండి స్వీకరించిన దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో రోడ్డుపాలయ్యాయన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటినా కూడా రైతుబంధు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. రైతుబంధు రూ.15 వేలు, కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీలు 420 హమీలే అని ఎద్దేవా చేశారు. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కోతలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉక్కిరి, బిక్కిరి చేస్తోందని విమర్శించారు. రైతుల పంటలు కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, వాటర్ ట్యాంకులు పెట్టి మరీ పంటలను కాపాడుకుంటున్నారని, కొంతమంది రైతులయితే పంటలను కాపాడుకోలేని పరిస్థితిలో తగులబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

- Advertisement -

ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు సీజన్లు రాగానే రైతు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు సమయానికి జమ అయ్యాయన్నారు. కనీసం కరెంటు పోయిన దాఖలాలు కూడా లేవని, రెండు పంటలను రైతులు పండించుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయని, వాటిలో ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ సర్వీసు, ఆరోగ్య శ్రీ, 500లకే ఉచిత గ్యాస్ పథ‌కాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలు పెట్టి అమలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. అభివృద్ధి పథంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం వైపు అడుగులు వేయిస్తుందన్నారు. నేటికి కూడా వితంతువు, వృధాప్య పించన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. దమ్ముంటే అర్హులైన ప్రతీ మహిళకు రూ.2500 ఇవ్వాలని, అర్హులందరికీ పెంచిన పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతన్నలకు ఆధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తేదీన రుణమాఫీ చేస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని తొమ్మిది తారీఖులు రాలేదని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీ పథకాలు నేరవేరుస్తామని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మాట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని అన్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హమీలను నేరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతామని, కర్ర కాలిచి వాత పెడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యం బాబు, సొసైటి చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement