Wednesday, May 8, 2024

KNR | నాణ్యతగా మన ఊరు-మన బడి పనులు.. పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన

పెద్దపల్లిరూరల్, (ప్రభ న్యూస్): సంవత్సరాల తరబడి మన్నికగా, గుర్తుండి పోయేలా నాణ్యతతో మన ఊరు మన బడి పనులు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ సంచాలకులు ఎ. శ్రీదేవసేన ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. రమేష్ లతో కలిసి తొలిమెట్టు, మన ఊరు మన బడి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎంపిక చేసిన 191 పాఠశాలలో 30 లక్షలు లోపు ఉన్న 173 పాఠశాలలో 98 శాతం గ్రౌండింగ్ అయిందని, 30 లక్షలకు పైగా ఉన్న 18 పాఠశాలల పనులకు గాను ఒక పాఠశాల మాత్రమే పనులు ప్రారంభం అయినట్లు ఆన్ లైన్ లో నమోదైందని, క్షెత్రస్థాయిలో దాదాపు 12 పాఠశాల పనులు జరుగుతున్నాయని, సదరు వివరాలను ఆన్ లైన్ లో వెంటనే అప్డేట్ చేయాలని ఆమె సూచించారు.

ఇప్పటి వరకు మన ఊరు మన బడి పనులకు రూ. 5.74 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని, మన ఊరు మన బడికి నిధుల కోరత లేదని, ప్రతి నెల రూ. 200 కోట్లు వరకు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగిందని, పనులు చేసి ఎఫ్.టి. ఓ లు జెనరేట్ చేసిన వెంటనే మంజూరు చేయడం జరుగు తుందని తెలిపారు. ఇక నుంచి నిధులను సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా విడుదల చేస్తామని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద నిధులు విడుదల అవుతాయని అన్నారు.

జిల్లాలో మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎంబి రికార్డులు నమోదు చేసి ఎఫ్.టి.ఓ జనరేట్ చేయాలని అధికారులకు ఆమె ఆదేశించారు. మోడల్ పాఠశాలల్లో పనులను డిసెంబర్ మాసంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రణాళిక బద్దంగా బోధనాభ్యాసన కార్యక్రమాలు అమలు పరుస్తూ, బోధిస్తున్న పాఠ్యాంశాలపై, వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమం కింద పాఠశాలల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి విద్యార్థి బేసిక్ అంశాలు నేర్పెందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి సంభందిత పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా చూడాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి దశలో భాగంగా పనులను 191 పాఠశాలల్లో చేపట్టగా, ప్రతి మండలానికి రెండు స్కూల్ల చొప్పున 28 మోడల్ స్కూల్స్ లలో మన ఊరు మన బడి పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. అంతకుముందు తెలుగు భాష ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి రచించిన తెలుగు బడి బాల వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్, మండల, క్లస్టర్ నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement