Sunday, May 19, 2024

TS: అధికారులు అలర్ట్ గా ఉండాలి.. రైతులకు ఇబ్బందులు రానివ్వద్దు.. డీఎస్ చౌహాన్

ప్రతి రైతు సెల్ నెంబర్ ఎంట్రీ చేయాలి..
తేమశాతం సరిగా రాగానే
ధాన్యాన్ని తూకం వేయాలి..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
కొత్తపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, వారం రోజులపాటు అధికారులంతా అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. బుధవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా ధాన్యానికి సంబంధించిన తేమ శాతాన్ని పర్యవేక్షించారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కేంద్రానికి వచ్చింది.. డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులతోనూ మాట్లాడారు. ధాన్యం డబ్బులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయా అని అక్కడికి వచ్చిన రైతులను అడిగి తెలుసుకున్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే బ్యాంక్ ఖాతాలో జమవుతున్నాయని రైతులు కమిషనర్ కు వివరించారు.

ఈ సందర్భంగా రిజిస్టర్ ను తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ… ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి రైతుకు సంబంధించిన సెల్ నంబర్ ను రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనను కచ్చితంగా అధికారులు, సిబ్బంది పాటించాలని సూచించారు. దీంతో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సరిగా తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. తరుగు పేరిట మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టర్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు రైతులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అధికారులు తరచూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, ఇన్చార్జి డిఎస్ఓ సురేష్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, డీసీఓ రామానుజ చార్య, డీఆర్డిఓ శ్రీధర్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం డబ్బులు వచ్చాయా..
ఓ రైతు తో ఫోన్లో మాట్లాడిన కమిషనర్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ నేరుగా ధాన్యం అమ్మిన ఒక రైతుతో సెల్ ఫోన్లో మాట్లాడారు. వారి సంభాషణ ఈ విధంగా సాగింది.
కమిషనర్ : లచ్చయ్య వడ్లు అమ్మిన డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయా..
రైతు : మూడు, నాలుగు రోజుల్లో జమ అయ్యాయి..
కమిషనర్ : అన్ని వడ్లు అమ్మినవా..
రైతు : ఇంకా కొన్ని అమ్మేవి ఉన్నాయి..
కమిషనర్ : కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..
రైతు : ఏం లేవు.. అంతా బాగానే ఉంది..
కమిషనర్ : వడ్లు ఎప్పుడు అమ్మినవ్
రైతు : మూడు, నాలుగు రోజుల కింద అమ్మిన
రైతు : ఇంతకు మీరెవరు మాట్లాడుతున్నది..
కమిషనర్ : నేను పౌరసరఫరాల ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా..
రైతు : ఉంటా సార్..
కమిషనర్, రైతుకు మధ్య సెల్ ఫోన్ లో ఈ విధంగా సంభాషణ సాగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement